బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలపై జరిమానా విధించిన సుప్రీం

By telugu teamFirst Published Aug 10, 2021, 5:11 PM IST
Highlights

అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడించాలన్న ఆదేశాలను పెడచెవిన పెట్టినందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలకు సుప్రీంకోర్టు ఫైన్ వేసింది. సీపీఎం, ఎన్సీపీలకు రూ. 5 లక్షలు, మిగతా పార్టీలకు
రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఎనిమిది వారాల్లో చెల్లించాలని తెలిపింది. అభ్యర్థుల నేర చరిత్రను ఓటర్లు సులువుగా తెలుసుకోవడానికి ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని ఈసీని ఆదేశించింది.

న్యూఢిల్లీ: నేరపూరిత చరిత్ర గల అభ్యర్థుల వివరాలు వెల్లడించలేదని బీజేపీ, కాంగ్రెస్ సహా 9 పార్టీలపై సుప్రీంకోర్టు మండిపడింది. కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ జరిమానా విధించింది. బీజేపీ, కాంగ్రెస్, జనతా దళ్, ఆర్జేడీ, సీపీఐ, ఎల్జేపీలపై రూ. 1 లక్ష జరిమానా విధించగా, సీపీఎం, ఎన్సీపీలు రూ. 5 లక్షల ఫైన్ కట్టాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లో అన్ని పార్టీలు జరిమానా డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఓ రూలింగ్‌లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్రను నామినేషన్‌కు కనీసం రెండు వారాల ముందు పబ్లిష్ చేయాలని పేర్కొంది. ఈ తీర్పును పార్టీలు అమలు చేయలేదని న్యాయమూర్తులు రోహింటన్ ఫాలి నారిమన్, బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం ఆగ్రహించింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, ఎన్సీపీలు తమ ఆదేశాలను పూర్తిగా పెడచెవిన పెట్టాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అందుకే ఈ రెండు పార్టీలకు ఇతర పార్టీలకన్నా ఎక్కువ మొత్తంలో ఫైన్ వేసింది. ఈ రెండు పార్టీల తరఫు న్యాయవాదులు బేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికీ ధర్మాసనం స్వీకరించలేదు. తమకు క్షమాపణలు వద్దని, ఆదేశాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో రాజకీయ పార్టీలను జాగ్రత్తగా ఉండాలని, తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్న 48 గంటల్లోనే వారికి నేర చరిత్ర ఉంటే పార్టీ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ప్రచురించాలని ఆదేశించింది.

ఓటర్ల అవగాహనకు మొబైల్ యాప్
తాము ఓటేసే అభ్యర్థి వివరాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని, అందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. పార్టీలు జమ చేసిన జరిమానాలనూ అభ్యర్థుల నేర చరిత్రపై ఓటర్లకు అవగాహన కల్పించే ఎన్నికల సంఘం కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు వివరించింది.

click me!