అంబానీ ఇంటి వద్ద కారు కలకలం కేసు: ముంబై సీపీపై వేటు.. ఎన్ఐఏ చేతిలో కీలక ఆధారాలు

Siva Kodati |  
Published : Mar 17, 2021, 05:39 PM IST
అంబానీ ఇంటి వద్ద కారు కలకలం కేసు: ముంబై సీపీపై వేటు.. ఎన్ఐఏ చేతిలో కీలక ఆధారాలు

సారాంశం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద ఆయుధాలతో నిండిన వాహనం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై పోలీస్ కమీషనర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద ఆయుధాలతో నిండిన వాహనం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై పోలీస్ కమీషనర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

సీపీగా వున్న పరమ్ వీర్ సింగ్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో హేమంత్ నగరాలేను నియమించింది. పరమ్ వీర్ ప్రస్తుతం హోం గార్డ్ విభాగానికి బదిలీ అయినట్లుగా తెలుస్తోంది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నివాసంలో సమావేశంల తర్వాత పరమ్ వీర్ సింగ్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక ముంబైలోని ముఖేశ్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్ధాల ఘటన తర్వాత చకచకా పరిణామాలు మారుతున్నాయి. సచిన్ వాజేని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి సచిన్ వాజే నుంచి ఎలాంటి సమాచారం బయటపెట్టలేకపోయారు ఎన్ఐఏ అధికారులు.

కుట్రలో తన పాత్ర గురించి కానీ సహనిందితుల గురించి కాని వాజే నోరు మెదపలేదని అంటున్నాయి ఎన్ఐఏ వర్గాలు. దీంతో కుట్రలో వాజే పాత్ర ఏమిటన్న దానిపై ఎన్ఐఏ వర్గాలకు స్పష్టత రావడం లేదు.

Also Read:అంబానీకి బెదిరింపుల కేసులో సంచలనాలు: వాజేకి పీపీఈ కిట్ తో సీన్ రీ క్రియేషన్

పేలుడు పదార్థాలున్న స్కార్పియోను పార్క్ చేసిన చోట వాజే పీపీఈ కిట్ ధరించి నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించింది ఎన్ఐఏ. తర్వాత వాజే సదరు పీపీఈ కిట్‌ను తగులబెట్టినట్లు వెల్లడించింది.

ఇదే విషయాన్ని వాజే రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది ఎన్ఐఏ. మరోవైపు ఫిబ్రవరి 17న సీఎస్‌టీ నుంచి థానే వరకు మన్సూఖ్ హీరేన్ ప్రయాణించిన మెర్స్‌డెస్ బెంజ్ వాహనాన్ని ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు.

సీఎస్‌టీలో గుర్తు తెలియని వ్యక్తిని కలిసిన తర్వాత అదే వాహనంలో తిరిగి థానే చేరుకున్నాడు హీరేన్. ఈ వాహనాన్ని గతంలో సచిన్ వాజే ఉపయోగించాడు. అలాగే మెర్స్‌డేజ్ వాహనంలో రూ.5 లక్షల నగదుతో పాటు నోట్ల కౌంటింగ్ మెషిన్, పేలుడు పదార్ధాలు పెట్టిన స్కార్పియో నెంబర్ తాలూకూ అసలు నెంబర్ ప్లేట్, సచిన్ వాజే ధరించిన దుస్తులు లభ్యమయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Women Safety Apps : అమ్మాయిలూ.. మీ ఫోన్లో ఈ యాప్స్ లేకుంటే అరిచి గోలచేసినా లాభం ఉండదు
Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu