ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు, పలు మార్లు హెచ్చరించినా తన వైఖరి మార్చుకోనందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు బీఎస్పీ పేర్కొంది.
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ డానిష్ అలీపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు. పలుమార్లు హెచ్చరించినా ఆయన తన వైఖరి మార్చుకోలేదని పేర్కొన్నారు. మహువా మోయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని డానిష్ అలీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా చేసిన మరుసటి రోజే బీఎస్పీ ఆయనను సస్పెండ్ చేసింది. అయితే, డానిష్ అలీని సస్పెండ్ చేయడానికి గల స్పష్టమైన కారణాలను పార్టీ వెల్లడించలేదు.
డబ్బుకు ప్రశ్న కేసును విచారించిన పార్లమెంట ఎథిక్స్ కమిటీ తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాను దోషిగా తేల్చింది. ఈ ఎథిక్స్ కమిటీ నివేదికను పార్లమెంటు అంగీకరించింది. ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ వ్యవహారంపై మహువా మోయిత్రా స్వయంగా మాట్లాడటానికి కూడా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వలేదు. దీన్ని డానిష్ అలీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీరును నిరసిస్తూ ప్రదర్శన చేశారు.
Also Read: ఔను.. దర్శన్ హీరానందానికి లాగిన్ ఐడీ ఇచ్చాను! కానీ, లంచం కోసం కాదు: మహువా మోయిత్రా
‘2018లో నువ్వు జేడీఎస్ అధినేత దేవే గౌడతో కలిసి పని చేశావు. ఆ సమయంలో కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేశాయి. ఆ తర్వాత దేవెగౌడ ఒత్తిడితో అమ్రోహ టికెట్ నీకు ఇచ్చి పోటీకి అవకాశం ఇచ్చాం’ అని బీఎస్పీ పేర్కొంది. కానీ, యూపీలోని అమ్రోహ నుంచి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీఎస్పీ తెలిపింది.
Also Read: Telangana Assembly: ఇద్దరు మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు - ఎందుకు?
బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి.. డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన అభ్యంతరక వ్యాఖ్యలతో డానిష్ అలీపై దేశవ్యాప్తంగా ఫోకస్ వచ్చింది.