
మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ వైరస్ పై నెలకొన్న భయాలను తొలగించడానికి ప్రయత్నించారు. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కనిపించడం మొదలైప్పుడే భారత్ వ్యాధిపై పోరాటానికి సన్నాహాలను ప్రారంభించిందని చెప్పారు. ‘‘ మంకీపాక్స్ భారతదేశంలో, ప్రపంచంలో కొత్త వ్యాధి కాదు. 1970 నుండి ఆఫ్రికా నుండి చాలా కేసులు వస్తున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రత్యేక దృష్టి సారించింది. భారతదేశంలో కూడా పర్యవేక్షణ ప్రారంభమైంది ’’ అని పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మాండవీయ రాజ్యసభలో మంగళవారం అన్నారు.
రక్షణ, భద్రత రంగాల్లో భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శాంతికి కీలకం - ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజలెవరూ భయాందోళనలకు గురికావద్దని ఆయన సూచించారు. సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవగాహన ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘‘మంకీపాక్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒక అవగాహన ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన చాలా అవసరం. భారత ప్రభుత్వం తరఫున నీతి ఆయోగ్ సభ్యుడి అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాం ’’ అని అన్నారు.
‘‘ ప్రపంచంలో కేసులు కనిపించడం ప్రారంభించినప్పుడే భారత్ సన్నాహకాలను మొదలు పెట్టింది. కేరళలో మొదటి కేసుకు ముందు మేము అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేశాం. మేము నిపుణుల బృందాన్ని పంపించాం. కేరళ ప్రభుత్వానికి సహాయం చేశాం. కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగింది ’’ అని మాండవీయ అన్నారు. ‘‘టాస్క్ ఫోర్స్ పరిశీలనల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలను మేము అంచనా వేస్తాము. అధ్యయనం చేస్తాము. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అవసరమైతే అది అందిస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది ’’ అని అన్నారు.
మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్. ఇది జంతువుల నుండి మానవులకు వ్యాప్తి చెందుతుంది. మశూచి రోగులలో కనిపించే లక్షణాలను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. కాగా మంకీపాక్స్ రోగులు, వారి కాంటాక్ట్స్ కోసం కేంద్రం గత నెలలో మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో 21 రోజుల ఐసోలేషన్ తప్పనిసరి చేసింది. మంకీపాక్స్ రోగులు, వారి కాంటాక్ట్స్ మాస్కులు ధరించాలని, చేతి పరిశుభ్రత పాటించాలని, గాయాలను పూర్తిగా కప్పి ఉంచాలని ప్రభుత్వం సూచించింది.
WB SSC Scam : నాకు తెలియకుండానే నా ఇంట్లోకి డబ్బు వచ్చింది - అర్పితా ముఖర్జీ
పశ్చిమ, మధ్య ఆఫ్రికా వంటి ప్రాంతాలలో మంకీపాక్స్ కేసులు కనిపిస్తుండేవి. అయితే అవి ఇటీవల ఇతర దేశాల్లో కూడా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ జ్వరం, తలనొప్పి, మూడు వారాల వరకు దద్దుర్లు, కణుపులు, గొంతునొప్పి, దగ్గు, అనేక రకాల వైద్య సంక్లిష్టతలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలలో ముఖ్యంగా పుండ్లు ఉంటాయి. ఇవి సాధారణంగా జ్వరం ప్రారంభమైన ఒకటి నుండి మూడు రోజుల్లో ప్రారంభమవుతాయి. ఇవి సుమారు రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటాయి. అవి దురద పెట్టే అవకాశం ఉంటుంది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.