
కర్ణాటక బెంగళూరులో రాత్రి సమయంలో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా ఓ మోడల్ పోలీసులను ఆశ్రయించారు. బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫాం రాపిడో రైడర్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో ఆరోపించారు. మోడల్‌తో పాటు డబ్బింగ్ ఆర్టిస్టు కూడా అయిన 21 ఏళ్ల బాధితురాలు.. సోమవారం బెంగళూరులోని హెన్నూరు పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. నిందితుడి పేరును మంజునాథ్ తిప్పేస్వామి అని పర్కొన్న బాధితురాలు.. రాత్రి 10.30 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటి చేరుకోవడానికి జక్కూరు నుంచి బాబుసాబ్‌పాళ్యం వెళ్లేందుకు ర్యాపిడోలో కేఏ51 హెచ్ 5965 నంబర్ గల బైక్‌ను బుక్ చేసినట్లు తెలిపారు.
అయితే తాను బైక్ ఎక్కుతున్న సమయంలో నిందితుడి ఫోన్ ఆఫ్‌లో ఉందని.. దీంతో అతడు గైడ్ చేయమని చెప్పి ఓటీపీ నెంబర్ తీసుకోలేదని బాధితురాలు తెలిపారు. అయితే నిందితుడు చెప్పినట్టుగా రూట్ గైడ్ చేస్తున్న సమయంలో.. అతడు తనను తాకడం ప్రారంభించాడని చెప్పారు. నిందితుడు తన ప్రైవేట్ భాగాలను తాకి వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఐపీసీ సెక్షన్ 354(ఏ) కింద ఫిర్యాదు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.