
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా వుంది. దీంతో దరఖాస్తు గడువును నవంబర్ 21 వరకు పెంచుతున్నట్లు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటించారు. గడిచిన పది రోజుల వ్యవధిలో 1100 మంది రూ.5000 చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేశారు. అలాగే వీరిలో 500 మంది నిబంధనలను అనుసరించి రూ.2 లక్షల డిపాజిట్ చెల్లించారు.
మరోవైపు.. ఇప్పటి వరకు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే దరఖాస్తులు సమర్పించగా, ఇంకా 20 మందికి పైగా అప్లికేషన్‌లు అందజేయాల్సి వుంది. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే సిద్ధాంతాన్ని కేపీసీసీ ఖచ్చితంగా అమలు చేస్తోంది. డిసెంబర్ చివరి నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయనున్నారు. తర్వాత జనవరిలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనకు అభ్యర్ధుల జాబితాను పంపించనున్నారు. అయితే ఎన్నికలకు ముందు వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి కూడా టికెట్ల కేటాయింపులను పరిశీలించనున్నారు.
ALso REad:భారత్ జోడో యాత్రలో నన్ను ఆపేందుకు బీజేపీ కుట్ర..: కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే
ఇకపోతే... కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్.. కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు హాజరు కావడం అధికార బీజేపీకి ఇష్టం లేదని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనకు సమన్లు జారీ చేసిన సమయాన్ని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రకు హాజరుకాకుండా తనను ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందనీ, ఈ క్రమంలోనే కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోంది ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ శుక్రవారం ఢిల్లీలోని ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరుతున్న క్రమంలోనే తనను ప్రశ్నించడం ఆలస్యం చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిని ఈడీ తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆయన, కేంద్ర ఏజెన్సీ, బీజేపీ సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.