
Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. ఈ క్రమంలోనే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాటల యుద్ధం కొనసాగుతోంది. మొదట ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్ లో తిరుగులేని విజయంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఆప్.. ఇప్పుడు గుజరాత్ పై కన్నేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీకి చెక్ పెట్టి.. అధికార పీఠం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆప్ ముమ్మరంగా ప్రచారం చేస్తూ.. ప్రజల్లోకి వెళ్తోంది. అయితే, బీజేపీ ఓటమి భయంతో తమ అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్ లు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆప్ ఆరోపిస్తోంది.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన తమ అభ్యర్థి కంచన్ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆప్ పేర్కొంది. ఆయనను బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆరోపించింది. సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కంచన్ జరీవాలాను గుజరాత్ ఎన్నికల బరిలోకి దింపాలని ఆమ్ ఆద్మీ (ఆప్) నిర్ణయించుకుంది. అయితే, ఓటమి భయంతో కంచన్ జరీవాలాను బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆప్ నాయకుడు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. ఇదే విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను కలవడానికి తాను సమయం కోరానని తెలిపారు. కిడ్నాప్ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికే జరగలేదని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేననీ, దీనిపై ఈసీ కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
గుజరాత్‌లోని సూరత్ (తూర్పు) నుంచి మా అభ్యర్థి కంచన్ జరీవాలాను బీజేపీ అపహరించుకుపోయిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో అన్నారు. మంగళవారం నాడు చివరిసారిగా RO కార్యాలయంలో కనిపించాడని తెలిపారు. ఆయన నామినేషన్ తిరస్కరణకు ప్రయత్నించారు. అనంతరం ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎన్నికల సంఘంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆ తర్వాత మళ్లీ.. గుజరాత్‌లోని సూరత్ (తూర్పు) నుంచి మా అభ్యర్థి కంచన్ జరీవాలాను ఇప్పుడే రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకువచ్చారని అన్నారు. 500 మందికి పైగా పోలీసులు ఆయనను చుట్టుముట్టారనీ, తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.
రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇదే వాదన చేశారు. బహిరంగంగానే ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని ట్వీట్ చేశారు.