
బీహార్ : బీహార్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు ఐదు రోజులుగా కనిపించకుండా పోయాడు. ఐదు రోజుల తర్వాత సగం కాలిన స్థితిలో మృతదేహంగా గోనెసంచిలో లభ్యమయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి.. బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్ జిల్లా గోపాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నట్వాన్ గ్రామానికి చెందిన సాహెబ్ అన్సారి (27) అనే యువకుడు వృత్తిరీత్యా టైలరింగ్ చేస్తుంటాడు.
ఏప్రిల్ 26వ తేదీ రాత్రి భోజనం అయిన తర్వాత సాహెబ్ అన్సారి పడుకోవడానికి మేడమీదికి వెళ్ళాడు. ఆ తర్వాత అతను కిందికి రాలేదు. తెల్లవారిన తర్వాత కూడా ఎంతసేపటికి కిందికి రాకపోవడంతో.. అన్సారీ తండ్రికి అనుమానం వచ్చింది. దీంతో అతను మేడమీదికి వెళ్లి కొడుకు కోసం వెతికాడు.. కానీ సాహెబ్ కనిపించలేదు.
సాహెబ్ బయటికి వెళ్లడం తాను చూడలేదేమో.. పనిమీద బయటికి వెళ్ళాడేమో అనుకున్నాడు. కానీ రాత్రి ఎంత పొద్దుపోయినా అన్సారి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కంగారుపడ్డారు. ఇంటి చుట్టుపక్కల అంతా గాలించారు. కానీ, ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో వారు కొడుకు మిస్సింగ్ అంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఈ క్రమంలో ఐదు రోజుల తర్వాత శ్రీపూర్ ఓపి ప్రాంతంలోని భగవాన్పూర్ గ్రామం సమీపంలో ఓ కాలువ దగ్గర గోనెసంచిలో నుంచి దుర్వాసన వస్తుండడాన్ని అక్కడ స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారం వేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు గోనెసంచిని తెరిచి చూశారు. ఆ సంచిలో ఓ యువకుడి మృతదేహం సగం కాలి ఉంది. దీంతో అది ఎవరిదని కనిపెట్టే క్రమంలో అది ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాహెబ్ అన్సరిదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం దగ్గర ఒక మొమోరీ కార్డు, ఒక సిమ్ కార్డు, ఓ మహిళ ఫోటో దొరికింది. అయితే, అన్సారి హత్యకు ప్రేమ వ్యవహారం కూడా కారణమై ఉండొచ్చనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.