యువ‌తి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్‌.. ఫాలోవ‌ర్లు పెర‌గ‌డం లేద‌ని

Published : Apr 30, 2025, 05:28 PM IST
యువ‌తి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్‌.. ఫాలోవ‌ర్లు పెర‌గ‌డం లేద‌ని

సారాంశం

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మీషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గిపోవడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి, తన కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మీషా అగర్వాల్ మరణించి 6 రోజుల తర్వాత, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆమె కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. 24 ఏళ్ల మీషా తన 25వ పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే ఆత్మహత్య చేసుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గిపోవడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి, తన కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీషా కుటుంబం బుధవారం (ఏప్రిల్ 30)న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇన్‌స్టాగ్రామ్ చుట్టూ తన ప్రపంచాన్ని నిర్మించుకుంది

మీషా తన ప్రపంచాన్ని ఇన్‌స్టాగ్రామ్ చుట్టూ నిర్మించుకున్నట్లు ఆమె కుటుంబం తెలిపింది. ఆమెకు ఒక మిలియన్ ఫాలోవర్స్ రావాలని కోరుకునేది, ఆ టార్గెట్‌ను తన మొబైల్ లాక్ స్క్రీన్‌పై కూడా పెట్టుకుంది. ఈ విషయమై మీషా సోదరి చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆలోజింపజేస్తోంది. "నా చెల్లెలు తన ప్రపంచాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఫాలోవర్స్ చుట్టూ నిర్మించుకుంది. ఆమె లక్ష్యం ఒక మిలియన్ ఫాలోవర్స్ సంపాదించడమే. ఫాలోవర్స్ తగ్గడం మొదలవ్వగానే ఆమె కుంగిపోయింది, తనను తాను వృథా అనుకోవడం మొదలుపెట్టింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఆమె తీవ్ర డిప్రెషన్‌లో ఉంది. తరచుగా నన్ను కౌగిలించుకుని ఏడ్చేది. 'నా ఫాలోవర్స్ తగ్గిపోతే నేనేం చేస్తాను? నా కెరీర్ నాశనమైపోతుంది' అని అనేది." అని చెప్పుకొచ్చింది. 

 

 

కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు మీషా సోదరి రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ జీవితంలో ఒక భాగమే కానీ, మొత్తం జీవితం కాదని, అది సక్సెస్ కాలేదంటే అంతా అయిపోయినట్లు కాదని చెప్పుకొచ్చారు. "ఆమె ప్రతిభ గురించి, ఆమె డిగ్రీ గురించి, PCSJ ప్రిపరేషన్ గురించి గుర్తు చేశాను. ఒకరోజు జడ్జి కావచ్చని చెప్పాను. కెరీర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాను. దురదృష్టవశాత్తు నా చెల్లెలు మాట వినలేదు. ఇన్‌స్టాగ్రామ్, ఫాలోవర్స్‌ తగ్గిపోయారని ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవడం మా కుటుంబాన్ని కుంగదీసింది." అని చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఇప్పుడీ అంశం కొత్త చర్చకు తెర తీసింది. సోషల్ మీడియా మనిసి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?