కొన్ని అద్భుతాలు లాజిక్ కు అందవు. వాటిగురించి తెలిసినప్పుడు అబ్బురపడడమో, ఆశ్చర్యపడడమో తప్పా.. ఎంత ఆలోచించినా విషయం అంతు చిక్కదు.
కేరళ : కాసర్‌గోడ్‌లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో నాలుగు రోజుల క్రితం అద్భుత ఘటన వెలుగు చూసింది. నిరుడు చనిపోయిన బబియా అనే మొసలి స్థానంలో మరో మొసలి ప్రత్యక్షమయ్యింది. అనంతపద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలు... అంతులేని సంపదకు ఎంత ప్రసిద్దో.. అక్కడి సరస్సులోని మొసలికి కూడా అంతే ప్రసిద్ది.
బబియా అని పిలిచే ఈ మొసలిని చూడడానికి, దానికి ఆహరం వేయడానికి అక్కడికి వచ్చే భక్తులు ఎంతో ఆసక్తిని చూపేవారు. గత 70యేళ్లుగా ఈ మొసలి ఇక్కడ ఉందని చెబుతుంటారు. దానికి ‘బబియా’ అని ఎవరు పేరు పెట్టారో కూడా తెలియదు. నిరుడు బబియా మృతి చెందింది. ప్రస్తుతం బబియా చనిపోయిన సంవత్సరం గడిచిన తర్వాత, ఇటీవల సరస్సులో కొత్తది కనిపించింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు మృతి, ఒకరికి గాయాలు
ఆలయ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, సరస్సులో ఎప్పుడూ మొసలి ఒంటరిగానే ఉండేది. ఇప్పుడు కనిపించిన మొసలి నాల్గవది. ఈ విషయం వెలుగు చూడడంతో ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది. "ఒక మొసలి చనిపోయినప్పుడు మరొకటి అనివార్యంగా సరస్సులో కనిపిస్తుంది. ఇది ఎందుకు? ఎలా? జరుగుతుందో అంచనాలక అందని విషయం’’ అని ఆలయ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. నవంబరు
8న సరస్సు వెంబడి ఉన్న గుహలో కొత్త మొసలిని కొందరు భక్తులు గుర్తించినట్లు ఆలయ అధికారి తెలిపారు. మొసలి ఉన్నట్లు భక్తులు ఆలయానికి తెలియజేయడంతో ఆలయ అధికారులు శనివారం పరిశీలించారు. "ఇది ఒక చిన్న మొసలి. దాన్ని చూసిన తరువాత ఆలయ తంత్రి (ప్రధాన పూజారి)కి సమాచారం ఇచ్చాం. ఆ తరువాత ఏం చేయాలో ఆయన నిర్ణయిస్తారు" అని ఆలయ అధికారి తెలిపారు.
ఇంతకుముందు బబియా అని పిలవబడే మొసలి అక్టోబర్ 9, 2022న చనిపోయింది. అది ఆ సరస్సులో మూడవ మొసలి. బబియాకు చనిపోయే సమయానికి 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటుందని అంచనా. బబియాను చివరిసారిగా చూడడం కోసం రాజకీయ నాయకులతో సహా వందలాది మంది వచ్చారు.
ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబియా శాకాహారి.. గుళ్లో భక్తులు ఇచ్చే పండ్లు, అక్కడ తయారు చేసిన 'ప్రసాదం' మాత్రమే తింటుంది.
మహావిష్ణు దేవాలయం ఉత్తర కేరళ జిల్లా కాసరగోడ్‌లోని కుంబ్లా సమీపంలోని అనంతపురలో ఉంది. ఈ ఆలయాన్ని తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం మూలమైన 'మూలస్థానం' అని పిలుస్తారు.
"సంప్రదాయం ప్రకారం, సరస్సులో ఒకే మొసలి నివసిస్తుంది. ఒక మొసలి చనిపోయినప్పుడు మరొకటి అనివార్యంగా సరస్సులో కనిపిస్తుంది. ఇది గత కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతుంది" అని వెబ్‌సైట్ పేర్కొంది. "మొసళ్లు ఉన్నచోట సమీపంలో నది కానీ లేదా చెరువు కానీ లేదు. అదెక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ మొసలి మనుషులతో స్నేహంగా ఉంటుంది. హానిచేయనిది. మహావిష్ణువు ఆలయం చుట్టూ ఉన్న సరస్సులో దాని ఉనికి భాగవత పురాణంలోని సుప్రసిద్ధ గజేంద్ర మోక్ష కథలను గుర్తుచేస్తుంది" అని ఆలయ వెబ్‌సైట్ లో తెలిపారు.