ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిన ఘటన.. 40 మంది కార్మికులు సేఫ్‌!.. పైపు ద్వారా నీరు, ఫుడ్ సప్లై..

By Sumanth Kanukula  |  First Published Nov 13, 2023, 12:41 PM IST

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కొంతభాగం కూలిన ఘటనలో 40  మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.


ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం కొంతభాగం కూలిన ఘటనలో 40  మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వివరాలు.. ఉత్తరకాశీ జిల్లాలోని బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న సొరంగం ఆదివారంల ఉదయం 5 గంటలకు పాక్షికంగా కూలిపోవడంతో 40 మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్), పోలీసులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.

అయితే మొత్తం 40 మంది కార్మికులు క్షేమంగా ఉన్నారని.. పైపు ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని, చిక్కుకున్న కార్మికులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేశామని.. వారికి పైపు ద్వారా నీరు, ఆహార పదార్థాలను పంపామని తెలిపారు. 

Latest Videos

సొరంగం తెరిచి కార్మికుల కోసం ఎస్కేప్‌ పాసేజ్‌ సిద్ధం చేసేందుకు ఇప్పటి వరకు 20 మీటర్ల స్లాబ్‌ తొలగించామని.. ఇంకా 35 మీటర్ల మేర తొలగించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎక్స్‌కవేటర్లు, ఇతర భారీ యంత్రాలను ఉపయోగించి శిధిలాలను తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెప్పారు. ఇక, సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు చెందినవారని అధికారులు తెలిపారు.

ఇక, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. ఈరోజు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సంఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి రావాలని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాము. వారు త్వరగా రక్షించబడతారని మేము ఆశిస్తున్నాము’’ అని పుష్కర్ సింగ్ ధామి అన్నారు. 
 

click me!