నీట్ రద్దు చేయాలని తమిళనాడులో డీఎంకే ఆమరణ నిరాహార దీక్ష.. పాల్గొన్న మంత్రి ఉదయనిధి

By Asianet NewsFirst Published Aug 20, 2023, 2:33 PM IST
Highlights

తమిళనాడు నుంచి నీట్ కు మినహాయింపు ఇచ్చేంత వరకు ఆందోళనలు చేస్తూనే ఉంటామని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. గవర్నర్ ఉద్యోగం కేవలం పోస్ట్ మ్యాన్ మాత్రమేనని, రాష్ట్ర అసెంబ్లీ చేపట్టే అంశాలను రాష్ట్రపతి భవన్ కు పంపాల్సి ఉంటుందని తెలిపారు.

తమిళనాడులో నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో డీఎంకే ఆమరణ నిరాహార దీక్ష చేస్తోంది. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగుతోంది. కాగా.. సీఎం స్టాలిన్ ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై ఈ దీక్షలపై మాట్లాడారు. తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇచ్చేంత వరకు అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు. 

నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)ను రద్దు చేయాలంటూ తమ పార్టీ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ఓ పెళ్లిలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్ వ్యతిరేక బిల్లుకు అనుకూలంగా తాను ఎప్పటికీ సంతకం చేయబోనని తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ మండిపడ్డారు.ఈ విషయం ఇప్పుడు రాష్ట్రపతి వద్ద ఉందని, గవర్నర్ ఉద్యోగం కేవలం పోస్ట్ మ్యాన్ మాత్రమేనని, రాష్ట్ర అసెంబ్లీ చేపట్టే అంశాలను రాష్ట్రపతి భవన్ కు పంపాల్సి ఉంటుందని స్టాలిన్ అన్నారు.

VIDEO | DMK workers hold day-long hunger strike in Chennai against NEET exam in Tamil Nadu. pic.twitter.com/TqSDLNv8RB

— Press Trust of India (@PTI_News)

ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే భారీ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్న మదురై మినహా తమిళనాడు అంతటా అధికార పార్టీ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని వల్లూవర్ కొట్టంలోని నిరసన వేదిక వద్ద డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధితో పాటు సీనియర్ నేతలు, కేబినెట్ మంత్రులు దురైమురుగన్, మా సుబ్రమణియన్, పీకే శేఖర్ బాబు, పార్టీ ఎంపీలు దయానిధి మారన్, ఎమ్మెల్యేలు, చెన్నై మేయర్ ప్రియా ఆర్ పాల్గొన్నారు. 

కాగా.. ఇటీవల జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా నీట్ ను రద్దు చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నేరుగా సంబంధం ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చాలని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యను తిరిగి రాష్ట్ర జాబితాకు (ఉమ్మడి జాబితా నుండి) తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే నీట్ వంటి పరీక్షలను పూర్తిగా రద్దు చేయవచ్చని తెలిపారు. విద్యను రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలోకి ప్రవేశపెడితేనే పరీక్షను తొలగించగలమని స్టాలిన్ అన్నారు.

అంతకు ముందు రాష్ట్రపతికి కూడా ఈ విషయంలో లేఖ రాశారు. నీట్ కారణంగా తమిళనాడులో 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. నీట్ నుంచి మినహాయింపు ఇచ్చే బిల్లుకు ఆమోదం తెలిపి + 2 (ఇంటర్) మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు జరిపి ఉంటే ఈ దుర్ఘటనలను కచ్చితంగా నివారించేవారన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల అడ్మిషన్ బిల్లు 2021కు ఆమోదం తెలపడంలో జాప్యమే ఈ దురదృష్టకర పరిణామాలకు కారణమని సీఎం స్టాలిన్ ఆరోపించారు. 

click me!