‘కూ’ సంచలన నిర్ణయం.. యూజర్లకు సెల్ఫ్ వెరిఫై ఆప్షన్.. ప్రత్యర్థి ట్విట్టర్‌కు దెబ్బేనా?

Published : Apr 06, 2022, 05:12 PM ISTUpdated : Apr 06, 2022, 05:14 PM IST
‘కూ’ సంచలన నిర్ణయం.. యూజర్లకు సెల్ఫ్ వెరిఫై ఆప్షన్.. ప్రత్యర్థి ట్విట్టర్‌కు దెబ్బేనా?

సారాంశం

దేశీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్‌ను బలంగా ఎదుర్కొనే సమర్థమైన అడుగు వేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లో ఫేక్ అకౌంట్లను తొలగించడానికి సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను తెచ్చింది. ఆధార్ కార్డు ద్వారా ఈ ప్రక్రియను కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయనుంది.  

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నది. మన దేశంలోనూ ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెరిఫై యూజర్‌గా కొనసాగడాన్ని ఓ హోదాగా భావిస్తుంటారు. సెలెబ్రిటీలు, క్రికెటర్లు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులకు మాత్రమే ఈ హోదా లభిస్తూ ఉంటుంది. ట్విట్టర్‌లో వెరిఫై ప్రక్రియ చాలా దీర్ఘంగా, క్లిష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు వారాలపాటు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే, ఈ ట్విట్టర్‌పై కొన్ని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అది నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలోనే దేశీయ సామాజిక వేదిక ‘కూ’కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. తాజాగా, ఈ కూ ప్లాట్‌ఫామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూజర్‌లు సెల్ఫ్ వెరిఫై చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.

సోషల్ మీడియా అదొక వర్చువల్ ప్రపంచం. అందులో నిజాలేవో.. అబద్ధాలేవో.. ఎవరు నిజమైన యూజర్లో.. ఏవి ఫేక్ అకౌంట్లో తేల్చుకోవడం కష్టంగా మారింది. అంతేకాదు, మనుషులకు బదులు బాట్లు కూడా రంగంలోకి దిగడంతో సోషల్ మీడియా చాలా అసహజంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే యూజర్ల వెరిఫికేషన్ కీలక ప్రక్రియగా మారింది. ఈ మార్గంలోనే ఒక అడుగు ముందుకు వేసి కూ సోషల్ మీడియా సెల్ఫ్ వెరిఫికేషన్ ఆప్షన్ తెచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా ఆ సోషల్ మీడియా వేదిక విశ్వసనీయత పెరుగుతుంది. దేశీయ వేదిక కూ ప్లాట్‌ఫామ్‌కు ఆదరణ ఒక్కసారి అనూహ్యంగా పెరిగే అవకాశాలూ లేకపోలేదు. ఈ నిర్ణయం ట్విట్టర్‌పై గట్టి దెబ్బే వేసే అవకాశాలు ఉన్నాయి.

ఇందులో యూజర్లు తమ బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు నెంబర్ ‘ఆధార్’ను తమ కూ అకౌంట్‌కు జత చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అకౌంట్‌ను సమీక్షించడానికి సదరు ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓ పాస్‌వర్డ్‌ను పంపిస్తుంది. ఈ ప్రక్రియ అంతా కొన్ని నిమిషాల్లో ముగుస్తుంది.

నేడు మైక్రోబ్లాగింగ్ సైట్లు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఏమంటే.. నకిలీ ఖాతాలు, బాట్లు, గుర్తు తెలియని ఖాతాల నుంచి ట్రోలింగ్ అని కూ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాక్రిష్ణ వివరించారు. ఈ స్వచ్ఛంద సెల్ఫ్ వెరిఫికేషన్  ప్రాసెస్ ద్వారా తమ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను సురక్షితమైన, వాస్తవానికి దగ్గరదైనదిగా తయారు చేస్తామని తెలిపారు. ఇలా సెల్ఫ్ వెరిఫై చేసుకున్న ఖాతాలకు గ్రీన్ టిక్స్ ఉండనున్నాయి.

దేశీయ మైక్రోబ్లాగింగ్ కూ  యాప్ కొత్త లోగోను గతేడాది మే నెలలో విడుదల చేసింది. కొత్త లోగోలో పసుపు రంగులో ఉన్న పక్షి కొత్త రూపంలో ఉంటుంది. కూ  యాప్ కొత్త లోగోను శ్రీ శ్రీ రవిశంకర్ 65వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. "కూ" యాప్ అనేది భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న భారతీయ మైక్రో బ్లాగ్. 

ఈ యాప్ మార్చి 2020లో ప్రారంభించారు. కూలో ఇప్పటివరకు 6 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ కొత్త లోగో  ప్రారంభంలో మాట్లాడుతూ “కూ యాప్ దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది ప్రజలను కలుపుతోంది. ఈ రోజు నేను కూ యాప్ కొత్త లోగోను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప సోషల్ మీడియా యాప్‌ను సృష్టించిన బృందానికి నా అభినందనలు. ” అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !