
బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ బుధవారం విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెబుతూనే ఇప్పటికైనా బీజేపీ తన సొంత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న ఆదర్శాలను బీజేపీ అనుసరించడం లేదని విమర్శించారు.
‘‘ హ్యాపీ బర్త్‌డే BJP! మీకు ఈరోజు 42 ఏళ్లు. మీ సొంత రాజ్యాంగానికి అనుగుణంగా జీవించడం మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం కాదా ? మీరు నిజంగా ఇప్పుడు విశ్వసించేది లేదా ఆచరించేది మీ రాజ్యాంగం మొదటి పేజీలో కనిపించడం లేదు. లేకపోతే ఈ పత్రం కల్పితమేనా ?’’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు ఆయన బీజేపీ రాజ్యాంగం ఫొటోను కూడా షేర్ చేశారు.
ధరల పెరుగుదలపై అధికారపై కూడా బీజేపీని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన 2013 నవంబర్ లో నరేంద్ర మోడీ ఓ కార్యక్రమంలో ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంబంధించినది. ఇందులో ధరల పెరుగుదలపై అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే.. పేదలు ఏం తింటారు ? ఈరోజు ప్రధాని ఇక్కడికి వచ్చారు. కానీ ద్రవ్యోల్బణంపై ఒక్క మాట కూడా మాట్లాడేందుకు ఇష్టపడలేదు ’’ అని ప్రధాని మోడీ ఆ వీడియోలో అన్నారు.
ఇదిలా వుండగా బీజేపీ రాజకీయాలు, జాతీయ విధానం కలిసికట్టుగా సాగుతున్నందున ప్రజాస్వామ్య సూత్రాలను స్థాపించేందుకు పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ రాజకీయాల్లోకి వచ్చి దేశానికి అంకితమైన తన పార్టీకి ‘కుటుంబాలకు అంకితమైన’ పార్టీకి చాలా తేడా ఉందని ఏ పార్టీ పేరు ప్రస్తావించకుండా ప్రత్యర్థి పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు.
‘‘ ఈ దేశంలో ఇప్పటికీ రెండు రకాల రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకటి కుటుంబ భక్తి రాజకీయాలు, మరొకటి దేశభక్తికి కట్టుబడి ఉంటాయి. ఈ వ్యక్తులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉండవచ్చు కానీ వారు ఒకరి అవినీతిని ఒకరు కప్పిపుచ్చుకుంటూ రాజవంశ రాజకీయాల తీగలతో అనుసంధానమై ఉన్నారు. జాతీయ స్థాయిలోనూ, కొన్ని రాష్ట్రాల్లోనూ తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పని చేసే రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. రాజవంశ ప్రభుత్వాలలో, కుటుంబ సభ్యులకు పార్లమెంటు నుండి స్థానిక సంస్థపై కూడా నియంత్రణ ఉంటుంది” అని వర్చువల్ ప్రసంగంలో ప్రధాన మంత్రి అన్నారు.
‘‘ ఇలాంటి కుటుంబ పార్టీలు ఈ దేశంలోని యువతను పురోగమించడానికి దోహదపడలేదు. యువత ఎప్పుడూ ఈ పార్టీల వల్ల ద్రోహానికి గురయ్యారు. వారితో పోరాటడానికి ముందుకు వచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అని మనందరం గర్వపడాలి’’ అని ప్రధాని మోడీ అన్నారు.