
Arvind Kejriwal: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో భారీ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌పై కన్నేసింది. అక్కడ మరింతగా విస్తరించాలని ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పోటీగా జాతీయ స్థాయిలో ఎదిగేందుకు పక్కా ప్రాణాళికలతో ముందుకు సాగుతున్న ఆప్.. దేశంలో త్వరలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో ఎన్నికలు జరగబోయే ఈశాన్య భారత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తోంది. ఎలాగైనా త్వరలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో బుధవారం నాడు రోడ్‌షో నిర్వహించారు.
ఆప్ రోడ్ షోకు ప్రజలు నుంచి మంచి స్పందన లభించింది. పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ‘మేం సామాన్యులం, రాజకీయాలు చేయడం తెలియదు.. ప్రజల కోసం పనిచేయడం, పాఠశాలలు నిర్మించడం, అవినీతిని అంతం చేయడం ఎలాగో మాకు తెలుసు. భగవంత్ మాన్ సీఎం అయినప్పటి నుంచి పంజాబ్‌లో కేవలం 20 రోజుల్లో అవినీతిని అంతమొందించాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఇది జరగాలి.. వెలుగులు రావాలి" అని అన్నారు. ప్రజల కోసం పనిచేసే రాజకీయాలు ఇప్పుడు హిమాచల్ పర్వతాలలో ప్రతిధ్వనిస్తాయిని పేర్కొన్నారు.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్ షో నిర్వహించిన మండి జిల్లా ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ సొంత జిల్లా కావడం గమనార్హం. అంతకుముందు AAP నాయకుడు సత్యేందర్ జైన్ హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉంటుందని జైన్ పేర్కొన్నారు. "కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని కోల్పోయింది మరియు దానిని ఓడించడంలో ఆప్‌కి తగినంత అనుభవం ఉంది" అని జైన్ మీడియాతో అన్నారు. గత పక్షం రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌లో మూడు లక్షల మంది చేరడంతో ఆప్ సభ్యత్వ కార్యక్రమం విజయవంతమైందని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్ తో పాటు గుజరాత్‌లో కూడా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ నేతలు కేజ్రీవాల్ మరియు మాన్ గత వారం గుజరాత్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీకి ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని పునరుద్ఘాటించారు.