
Meghalaya Assembly Election 2023: మేఘాలయ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకోవడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఎన్నికలకుముందు హింస చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి 31 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 16 మంది టీఎంసీకి చెందినవారు కాగా, మరో 15 మంది ఎన్పీపీకి చెందిన వారని ఎస్పీ తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మేఘాలయలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో జరిగిన ముందస్తు ఎన్నికల హింసలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లకు చెందిన కనీసం 31 మంది మద్దతుదారులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై, మేఘాలయ పోలీసు అధికారి మాట్లాడుతూ, అరెస్టయిన వ్యక్తులు ఫుల్బరి అసెంబ్లీ నియోజకవర్గంలోని చర్బటపరా గ్రామంలో మంగళవారం రాత్రి అల్లకల్లోలం సృష్టించిన ముఠాలో భాగంగా ఉన్నారని తెలిపారు.
మేఘాలయ పోలీసులు ఇంకా ఏం చెప్పారంటే..?
హింసాకాండ ఘటనను ప్రస్తావిస్తూ మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 31 మందిని అరెస్టు చేశామని తెలిపారు. అరెస్టయిన వారిలో 16 మంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు, 15 మంది ఎన్‌పీపీ కార్యకర్తలు ఉన్నారు. వాస్తవానికి పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)-అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపు 9 మందికి గాయాలయ్యాయి. ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారని, పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.
వివాదం ఎందుకంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10:45 గంటల ప్రాంతంలో ఫుల్బరీ అసెంబ్లీ నియోజకవర్గంలోని చర్బటపరా గ్రామంలో ఘర్షణ జరిగింది. టీఎంసీలో చేరిన ఎన్‌పీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌జీ ఎస్తామూర్ మోమిన్ తన బంధువుల ఇంట్లో విందులో పాల్గొనేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో గ్రామానికి వచ్చారు. ఆ తర్వాత ఎన్‌పీపీ మద్దతుదారుల బృందం అక్కడికి వెళ్లి రచ్చ సృష్టించింది. ఆ తర్వాత టీఎంసీ మద్దతుదారులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 9 మంది గాయపడ్డారు, వారిని చికిత్స కోసం ఫుల్బారి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
ఘటనపై ఫిర్యాదు..
గాయపడిన వారందరినీ ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినప్పటికీ. ఈ ఘటన తర్వాత నోజిమ్ హుస్సేన్ అనే వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఎన్‌పీపీకి చెందిన హబీబుర్ జమాన్ నేతృత్వంలోని గుంపు అతని ఇంటి దగ్గర ఆగి, అతని ఇంటిపై రాళ్లు రువ్వడంతో నలుగురు గాయపడ్డారని చెప్పబడింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే.. ?
రాష్ట్రంలోని మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 747 సెన్సిటివ్, 399 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, 119 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల కోసం మోహరించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎఫ్ ఆర్ ఖర్కోంగోర్ తెలిపారు. కాగా, 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా, మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.