యూపీ గ్లోబర్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. ప్రారంభ కార్యక్రమానికి అదానీ దూరం.. తాజా పరిణామాల నేపథ్యంలోనేనా..!

Published : Feb 10, 2023, 02:35 PM ISTUpdated : Feb 10, 2023, 02:36 PM IST
యూపీ గ్లోబర్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. ప్రారంభ  కార్యక్రమానికి అదానీ దూరం.. తాజా పరిణామాల నేపథ్యంలోనేనా..!

సారాంశం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను శుక్రవారం ప్రారంభమైంది. లక్నోలో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ.. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు  ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ నుంచి కుమార్ మంగళం బిర్లా, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్.. తదితరులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎండి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. యూపీలో జియో, రిటైల్, పునరుత్పాదక వ్యాపారాలలో రాబోయే నాలుగేళ్లలో రిలయన్స్ అదనంగా రూ. 75,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో అదనంగా 1 లక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని తెలిపారు. మరోవైపు యూపీలో 25,000 కోట్లు  పెట్టుబడి పెట్టనున్నట్టుగా కుమార్ మంగళం బిర్లా తెలిపారు. టాటా గ్రూప్ రాబోయే జేవార్ విమానాశ్రయంలో సమీకృత మల్టీ-మోడల్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇలా పలువురు వ్యాపారవేత్తలు యూపీలో పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ప్రకటనలు చేశారు.

అయితే ఈ సమ్మిట్‌ ప్రారంభోత్సవానికి దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్‌‌ మోసం, మార్కెట్ మానిప్యులేషన్ పాల్పడినట్టుగా హిండెన్‌బర్గ్ తన నివేదిక ఆరోపణలు చేయడంతో.. గౌతమ్ అదానీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దేశంలో విపక్షాలు సైతం అదానీ గ్రూప్‌ అంశంలో జేపీసీ చేత విచారణ జరిపించాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లో  గౌతమ్ అదానీ.. దేశంలోని కీలక రాష్ట్రమైన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ 2023 ప్రారంభ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కూడా చర్చ సాగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలోనే ఆయన ఈ సమ్మిట్‌కు హాజరుకాకపోయి ఉండొచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, గతేడాది జరిగిన యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ 2022కు హాజరైన గౌతమ్ అదానీ.. యూపీలో అదానీ గ్రూప్ 70,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్టుగా చెప్పారు. తద్వారా 30,000 ఉద్యోగాలను సృష్టించగలమని అంచనా వేస్తున్నామని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం