
చెన్నై: ఐటీ కంపెనీలకు సమర్థవంతమైన, నైపుణ్యమున్న ఉద్యోగులను కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. మరీ ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు అట్రిషన్ రేట్‌ను చూస్తే బెంబేలెత్తిపోతున్నాయి. చాలా మంది ఉద్యోగులు వేరే కంపెనీలకు పొలోమని వెళ్లిపోతున్నారు. ఏళ్ల తరబడి ఒక కంపెనీలో పని చేసుకుంటూ ఉండే ఉద్యోగుల సంఖ్య కరిగిపోతున్నది. విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను ఆకర్షించడానికి నానా అగచాట్లు పడుతున్నాయి. కానీ, తమిళనాడుకు చెందిన శ్రీ మూకాంబికా ఇన్ఫోసొల్యూషన్స్ (ఎస్ఎంఐ) మాత్రం ఈ అట్రిషన్ రేటును అదుపులోనే పెట్టుకోగలిగింది. గత కొన్నేళ్లుగా శ్రీ మూకాంబికా ఇన్ఫోసొల్యూషన్స్ అట్రిషన్ రేటును పది కంటే తక్కువగానే ఉంచగలిగింది. కాగా, దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఈ రేటు 20ని దాటింది.
అయితే, శ్రీ మూకాంబికా తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి అవలంభిస్తున్న పద్ధతులు చూస్తే విచిత్రంగా, వినూత్నంగా కనిపిస్తున్నాయి. మార్కెట్‌లోని మంచి టాలెంట్‌ను తన దగ్గర ఉంచుకోవడంలో ఈ కంపెనీ సఫలం అవుతున్నది. శ్రీ మూకాంబిక ఇన్ఫొసొల్యూషన్స్ తమ ఉద్యోగులకు పెళ్లి అవ్వగానే వేతనాలను పెంచుతుంది. అనతి కాలంలోనే అది మ్యాచ్ మేకింగ్ సేవలనూ అది ఉచితంగానే అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకు ఒకసారి 6 శాతం నుంచి 8 శాతం వేతనాల పెంపు విధానాన్ని అమలు చేసింది.
కాగా, గతేడాది సాఫ్ట్‌వేర్ రంగంలో అట్రిషన్ రేటు పెరగ్గానే సాలరీ ఇంక్రిమెంట్లను పెంచడం మొదలు పెట్టింది. రెండేళ్లకు ఒకసారి కాకుండా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి సాలరీ పెంపును, టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్‌కు ప్రత్యేక ప్రోత్సహకాలు ప్రకటించింది.
ఈ అంశంపై శ్రీ మూకాంబిక సంస్థ వ్యవస్థాపకుడు ఎంపీ సెల్వగణేష్ మాట్లాడుతూ, తమతో దీర్ఘకాలం ఉద్యోగం చేస్తున్నవారు చాలా మంది ఉన్నారని అన్నారు. అయితే, వారిని తాము ఉదారంగా ఏమీ తీసుకోమని తెలిపారు. తమ సంస్థ వదిలిపెట్టిపోయే ఆలోచనను వారిలో రానివ్వబోమని వివరించారు. ఎందుకంటే.. వారి అవసరాలను తాము ఆలోచిస్తూ అందుకు అనుగుణంగా ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. వారికి ఏదైనా సమస్య ఉంటే వారు నేరుగా తమను సంప్రదిస్తారని తెలిపారు.