
మావోయిస్టు కేంద్ర కమిటీ (Maoist central committee) సభ్యుడు రవి (ravi) మృతి చెందాడు. బాణం బాంబులను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మావోయిస్టు కేంద్ర కమిటీలో రవి.. టెక్ టీమ్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఏడాదిన్నర క్రితం రవి మరణించగా.. ఇందుకు సంబంధించి తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన చేసింది. జార్ఖండ్‌లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో రవి మృతి చెందినట్టుగా మావోయిస్టు కేంద్ర కమిటీ తెలిపింది. మావోయిస్టు టెక్నికల్ టీమ్‌లో కీలక సభ్యుడిగా రవి కొనసాగాడు. కమ్యూనికేషన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ డివైస్‌లు తయారు చేయడంతో రవి నైపుణ్యం ఉంది.
బాంబులు తయారుచేసి వాటిని పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రవి మరణించినట్టుగా Maoist central committee తెలిపింది. గతేడాది జూన్ 25న ఉదయం 11 గంటలకు రవి తీవ్రంగా గాయపడి మృతిచెందాడని.. అతని మరణం సహచరులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పింది. మరుసటి రోజు అంటే జూన్ 26వ తేదీన విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినట్టుగా వెల్లడించింది. రవి మృతి మావోయిస్టు పార్టీకి తీరని లోటని పేర్కొంది. ప్రజాయుద్దాన్ని పెంపొందించడంలో పీఎల్జీఏకు కొత్త ఆయుధాలు అందించే టెక్నీషియన్‌గా వివిధ రూపాల్లో విప్లవోద్యమానికి రవి సేవలు అందించారని మావోయిస్టు పార్టీ తెలిపింది.
అయితే నెల్లూరు జిల్లాకు చెందిన రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరించాడు. 2014లో రవి జార్ఖండ్‌కు వెళ్లి అక్కడే ఉంటూ ఆ పార్టీ గెరిల్లా ఆర్మీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. మావోయిస్టు నాయకుడి మృతిని ఏడాదిన్నర ఆలస్యంగా ప్రకటించడం గమనార్హం. అయితే అనివార్య పరిస్థితుల్లో ఏడాదిన్నర తర్వాత ఈ ప్రకటన చేస్తున్నట్టుగా మావోయిస్టు పార్టీ తెలిపింది.