ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియాకు కోర్టులో చుక్కెదురైంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక కోర్ట్. అలాగే సిసోడియాను మరికొంతకాలం కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అధికారుల విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. ఆయనను మరో రెండు రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందు హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను సీబీఐ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని ‘ఎన్డీటీవీ’ నివేదించింది.
సిసోడియా దేశ రాజధానిలో లిక్కర్ పాలసీని రూపొందించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్నారు. పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. తరువాత సీబీఐ విచారణకు ఆదేశించారు. అప్పటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టిన ఏజెన్సీ పలువురు పేర్లను ఛార్జ్ షీట్ లో పొందుపర్చింది. ఈ క్రమంలో గత ఆదివారం ఉదయం నుంచి ఆయనను విచారించిన సీబీఐ సాయంత్రం అరెస్టు చేసింది.
మరుసటి రోజు ప్రత్యేక కోర్టులో సీబీఐ హాజరుపరిచి ఐదు రోజుల రిమాండ్ కోరింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను సరైన, న్యాయంగా దర్యాప్తు చేయడానికి, ఆయన నుంచి వాస్తవమైన, చట్టబద్ధమైన సమాధానాలు పొందాలని ఏజెన్సీని ఆదేశిస్తూ రిమాండ్ కు అనుమతి ఇచ్చింది. గత రెండు సందర్భాల్లో ఈ కేసు దర్యాప్తులో సిసోడియా చేరినప్పటికీ.. పరీక్ష, విచారణ సమయంలో అతడిని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని కూడా గమనించినట్లు ఈ సందర్భంగా న్యాయమూర్తి చెప్పారని ‘జీ న్యూస్’ నివేదించింది. అతడిపై వచ్చిన నేరారోపణ సాక్ష్యాలను చట్టబద్ధంగా వివరించడంలో ఆయన విఫలం అయ్యాడని పేర్కొన్నారు.
కాగా.. ఈ అరెస్టు జరిగిన తరువాత సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే గతంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న మరో మంత్రి సత్యేందర్ జైన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అయిన అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను మంత్రులుగా నియమించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎల్జీకి సిఫారుసు చేశారు.