నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష వివాదం: సిసోడియా సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Jan 17, 2020, 8:58 AM IST
Highlights

నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో జాప్యానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలకు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కౌంటర్ ఇచ్చారు.

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులను, శాంతిభద్రతల బాధ్యతలను తమకు రెండు రోజుల పాటు అప్పగిస్తే నిర్భయ దోషులకు ఉరివేసి చూపిస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. 2017లో మరణ శిక్షను విధిస్తూ తీర్పు వెలువడిన వెంటనే దోషులు క్షమాభిక్ష అవకాశాలను వినియోగించుకునే విధంగా తీహార్ జైలు అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటే ఉరిశిక్ష అమలై ఉండేదని ఆయన అన్నారు. 

Also Read: కేజ్రీవాల్ ప్రభుత్వం వల్లే: నిర్భయ దోషుల ఉరిలో జాప్యంపై జవదేకర్

ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలకు సిసోడియా కౌంటర్ ఇచ్చారు. ఇంత సున్నితమైన విషయంపై కేందర్ మంత్రివర్గంలోని సీనియర్ సభ్యుడు అబద్ధం చెప్పడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రస్తావించడానికి తగిన సమస్యలు లేవనే విషయం తమకు అర్థమైందని ఆయన అన్నారు. అందువల్లనే ఇటువంటి విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. 

"జవదేకర్ జీ పోలీసులు మీ ఆధీనంలో ఉన్నారు. శాంతిభద్రతల బాధ్యత మీ కిందనే ఉంది. హోంశాఖ మీ ఆధీనంలో ఉంది. తీహార్ జైలు డీజీ, పరిపాలన మీ కిందనే ఉన్నాయి. అయినా మీరు మమ్మల్ని నిందిస్తున్నారు. దయచేసి సున్నితమైన అంశాలపై అవాస్తవాలు వద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దు" అని సిసోడియా అన్నారు.

"నేను మిమ్మల్ని (జవదేకర్ ను) అడగాలనుకుంటుననా. మీరు ఢిల్లీ శాంతిభద్రతలను నిర్వహించలేకపోతే, ఢిల్లీ పోలీసులను, శాంతిభద్రతల బాధ్యతను రెండు రోజులు మాకు అప్పగించండి. నిర్భయ దోషులను ఉరితీసి చూపిస్తాం" అని సిసోడియా అన్నారు.

click me!