మణిపూర్ రాష్ట్రంలో సోమవారం నుంచి పర్యటనలో ఉన్న ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ నుంచి వచ్చి బాధితులను కలువగలిగినప్పుడు రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ ఎందుకు కలువలేదని ప్రశ్నించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: జాతుల మధ్య ఘర్షణలతో రక్తమోడుతున్న మణిపూర్‌లో పర్యటిస్తున్న ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దూరాన ఉన్న ఢిల్లీ నుంచి తాను మణిపూర్ వచ్చి బాధితులను కలువగలిగానని, మరి, ఈ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఎందుకు కలువలేదని ఆమె ప్రశ్నించారు. సీఎం ఎన్ బీరెన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మణిపూర్‌లో మే 4వ తేదీన ఇద్దరు యువతులు నగ్నంగా ఓ సాయుధ మూక ఊరేగించి ఆపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఓ వీడియో వైరల్ కావడంతో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వీడియోలని బాధిత కుటుంబాలను డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ కలిశారు. వారిని పరామర్శించారు. గుండెలకు హద్దుకుని ఓదార్చారు. వారికి సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు.
సీఎం వెంటనే రాజీనామా చేయాలని స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ నుంచి వచ్చి నేను బాధితులను కలువగలిగినప్పుడు.. సీఎం ఎందుకు కలువలేదు?’ అని ఆమె ప్రశ్నించారు.
సోమవారం నుంచి ఆమె మణిపూర్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో మరో తల్లి తన గర్భశోకాన్ని వివరిస్తూ కన్నీరైంది. ‘నీ బిడ్డ ప్రాణాలతో కావాల? శవమై రావాలా? అని ఓ మైతేయి మహిళ అడిగింది. ఆ వెంటనే ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత నా బిడ్డను రేప్ చేసి చంపేశారని తెలిసింది.’ అని ఓ తల్లి ఆక్రందనతో అన్నమాటలివి. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి ఏరియాలో ఈ ఘటన మే 4వ తేదీన జరిగింది. అదే రోజున ఇదే జిల్లాలో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వైరల్ వీడియో ద్వారా బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.