
న్యూఢిల్లీ: తన పేరిట రూ. 10 లక్షల లోన్ మంజూరు చేయాలని ఓ దుండగుడు ఎస్‌బీఐ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ ఆఫీస్‌కు ఫోన్ చేశాడు. లేదంటే ఎస్‌బీఐ చైర్మన్‌ను చంపేస్తానని, ఎస్‌బీఐ కార్పరేట్ ఆఫీసును పేల్చేస్తానని బెదిరింపులు చేశాడు. నారిమాన్ పాయింట్ ఏరియాలోని ఎస్‌బీఐ చైర్మన్ పీఏ ఆఫీసుకు బుధవారం ఉదయం వచ్చిందని పోలీసులు శనివారం వివరించారు.
బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ అజయ్ కుమార్ శ్రీవాస్తవ్ ఈ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. దుండగుడు తనను మొహమ్మద్ జియా ఉల్ అలీగా పరిచయం చేసుకున్నాడని, తనకు కచ్చితంగా రూ. 10 లక్షల లోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేసినట్టు అజయ్ కుమార్ శ్రీవాస్తవ్ గురువారం వివరించారు.
Also Read: లోన్ కోసం వెతుకుతున్నారా, అయితే SBI Yono App ద్వారా లోన్ తీసుకుంటే బంపర్ ఆఫర్..ఏంటో చెక్ చేసుకోండి..
ఈ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాతి రోజు ఆయన దక్షిణ ముంబయిలని మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఐపీసీలోని సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు కాల్ వచ్చిన నెంబర్ కాల్ డీటెయిల్ రికార్డు తీసుకున్నారని పోలీసులు వివరించారు. ఆ ఫోన్ కాలం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే ముంబయి పోలీసుల బృందం ఒకటి పశ్చిమ బెంగాల్‌కు బయల్దేరిందని వివరించారు. నిందితుడిని పట్టుకుని తీరుతామని తెలిపారు.