
imposition of Hindi: హిందీని విధించడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. డీఎంకే నిరసనకు ఆ పార్టీ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. తమిళనాడులోని కేంద్ర విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని హోం మంత్రి అమిత్ షా చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అమిత్ షా, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనల్లో నినాదాలు చేశారు.
వివరాల్లోకెళ్తే.. హిందీ భాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు. డీఎంకేలో ప్రధాన్యత, ప్రభావవంతమైన నాయకుడు. గత కొంత కాలంగా తమిళనాడులో భాషకు సంబంధించి.. ముఖ్యంగా హిందీకి సంబంధిత అంశాల్లో వివాదం కొనసాగుతోంది. రాష్ట్రంలోని కేంద్ర విద్యా సంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా మార్చాలని హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ ప్యానెల్ ఇటీవల సిఫారసు చేసింది. పార్లమెంటరీ ప్యానెల్ సిఫారసుకు వ్యతిరేకంగా డీఏంకే పార్టీ రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాడు నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
కోయంబత్తూరులో హిందీ వ్యతిరేక ఆందోళన సందర్భంగా.. డీఎంకే నాయకుడు, ఆ పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి ఎన్. కార్తీక్ మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అనే భావనతో దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తమిళ భాషకు ఎలాంటి ముప్పు వచ్చినా దానిని అడ్డుకునేందుకు డీఎంకే ఎప్పుడూ ముందుంటుందనీ, 1930లలో, 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనలను కేంద్ర ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నామని కార్తీక్ పేర్కొన్నారు. హిందీని అధికార భాషగా మార్చాలనే ఆలోచనను ప్రాథమిక స్థాయిలోనే ఆపాలని డీఎంకే నేత, మాజీ మంత్రి పొంగళూరు ఎన్.పళనిస్వామి అన్నారు.
తొండముత్తూరు, పొల్లాచ్చిలో కూడా డీఎంకే జిల్లా కార్యదర్శుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. తిరుప్పూర్ జిల్లాలో, తిరుప్పూర్ సౌత్ ఎమ్మెల్యే కె. సెల్వరాజ్ నేతృత్వంలో జరిగిన నిరసనలో డిఎంకె సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందీ విధింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో భాషా యుద్ధానికి తెరలేపవద్దు.. కేంద్రానికి స్టాలిన్ లేఖ
కాగా, హిందీ విషయంలో ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రానికి లేఖ రాశారు. అక్టోబర్ 10న కేంద్రానికి లేఖ రాస్తూ సమైక్యతను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. హిందీని ప్రవేశపెట్టి మరో భాషాయుద్ధాన్ని బలవంతం చేయవద్దని కేంద్రాన్ని అభ్యర్థించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో, "భారత ఉపఖండం గర్వించదగినది.. భిన్నత్వం, ప్రజలు సామరస్యంతో సోదరులుగా జీవిస్తున్నారు, కానీ, బీజేపీ దేశాన్ని నాశనం చేసి, ఒకే దేశం, ఒకే మతంగా స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. ఒక ఆహారం-ఒకే సంస్కృతి. ఇది భారతదేశ ఐక్యతను ప్రభావితం చేస్తుంది" అని పేర్కొన్నారు.