పేదోళ్ల బ్రతులకు రోజురోజుకు మరింత దుర్భరంగా మారుతున్నాయి. ఇలా పేదరికంతో బాధపడుతున్న ఓ వ్యక్తి చేతిలో చిల్లిగవ్వ లేక భార్య మృతదేహాన్ని కిలోమీటర్ల కొద్దీ భుజాన మోసిన హృదయవిధారక ఘటన ఒడిశాలో వెలుగుచూసింది.
ఒడిశా : దేశం ఎంత అభివృద్ది చెందినా... ఎన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా పేదల బ్రతుకులు మాత్రం మారడంలేదు. రెక్కాడితే గాని డొక్కాడని పేదల ధీన పరిస్థితిని తెలియజేసే సంఘటన ఒకటి ఒడిశాలో వెలుగుచూసింది. ఇంతకాలం తన కష్టసుఖాల్లో తోడున్న భార్య చనిపోతే తనివితీరా కన్నీరు పెట్టలేకపోయాడు ఆ నిరుపేద భర్త. భార్య మృతదేహాన్ని తరలించడానికి డబ్బులు లేక తన భుజాలపై 20 కిలోమీటర్లు మోసాడు. ఈ హృదయవిధారక ఘటన పేదవారి బ్రతుకే కాదు చావు కూడా ఎంత దుర్భరమో తెలియజేస్తోంది.
వివరాల్లోకి వెళితే... ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా జగన్నాథ్ పూర్ పంచాయితీ పుపుగావ్ గ్రామానికి చెందిన కరుణ, అభి అమానత్య భార్యాభర్తలు. ఇటీవల గర్భంతో వున్న కరుణ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల క్రితమే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా బిడ్డపుట్టిన ఆనందం ఆ కుటుంబంలో ఎక్కువకాలం నిలవలేదు. బిడ్డ పుట్టిన కొన్నిరోజులకే కరుణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. ఇటీవల ఆమె ఆరోగ్య మరింత క్షీణించి పుట్టింట్లోనే కన్నుమూసింది.
భార్య మృతితో అభి అమానత్య తీవ్ర ధు:ఖంలో మునిగిపోయాడు. కన్నీటిని దిగమింగుకుంటూనే భార్య మృతదేహాన్ని తన ఇంటికి తరలించేందుకు సిద్దమయ్యాడు. ఇందుకోసం ప్రభుత్వ అంబులెన్స్ కోసం ప్రయత్నించాడు... కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేరు. ప్రైవేట్ వాహనంలో తరలిద్దామంటే అతడివద్ద డబ్బులులేవు. దీంతో చేసేదేమిలేక భార్య మృతదేహాన్ని తన భుజాలపైనే మోసుకెళ్లేందుకు సిద్దమయ్యాడు.
Also Read Indigo: సీటు కింద బాంబు ఉందంటూ విమానంలో ప్రయాణికుడి హల్ చల్.. తీరా కట్ చేస్తే..
తానే స్వయంగా కర్రలతో పాడెను తయారుచేసి దానిపై భార్య మృతదేహాన్ని పడుకోబెట్టాడు. దగ్గరి బంధువుల సాయంతో ఆ మృతదేహాన్ని తన ఇంటికి తరలించాడు. ఇలా ఏకంగా 20 కిలోమీటర్ల కాలి నడకనే భార్య మృతదేహాన్ని మోసుకెళ్ళాడు. ఇలా పుట్టినుండి మెట్టినింటికి భార్య కరుణ మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు అభి అమానత్య.