బిజెపియేతర కూటమి ప్రధాని అభ్యర్థి దీదీ

First Published Jul 27, 2018, 8:52 PM IST
Highlights

బిజెపియేతర కూటమి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సూచనప్రాయంగా చెప్పారు.

న్యూఢిల్లీ: బిజెపియేతర కూటమి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుకు వస్తున్నారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సూచనప్రాయంగా చెప్పారు. 

బిజెపిని ఓడించడానికి ప్రధాని పదవిని త్యాగం చేయడానికి కాంగ్రెసు పార్టీ కూడా సిద్ధమైన వేళ ఆమెకు ఢిల్లీ ద్వారాలు తెరుచుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సచివాలయంలో మమతను కలిసిన తర్వాత శుక్రవారం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. 

మమతను తాము ఢిల్లీకి తీసుకుని వెళ్తామని, దాని వల్ల ఆమె కోల్ కతాకు ఏం చేశారో దేశానికంతటికీ అది చేస్తారని ఆయన అన్నారు. జమ్మూకాశ్మీర్ లోని ప్రస్తుత పరిస్థితిపై ఆమెతో చర్చించినట్లు ఆయన తెలిపారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిపై కూడా తాము చర్చించామని, మైనారిటీల్లో నెలకొన్న భయాందోళనలపై మాట్లాడుకున్నామని చెప్పారు. 

తమ ఇరు పార్టీల మధ్య ఏ విధమైన విభేదాలు లేవని ఆయన చెప్పారు. తమ నెలకొల్పే కూటమికి ఏ పేరు పెట్టాలనే విషయంపై ఓ నిర్ణయానికి రాలేదని చెప్పారు. బిజెపికి వ్యతిరేకంగా ఉండేవాళ్లంతా తమతో చేరవచ్చునని, బిజెపిని ఓడించడానికి తాము ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. 

కొద్ది ప్రాంతీయ పార్టీలను మినహాయిస్తే మిగతా పార్టీలన్నీ బిజెపికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయని మమతా బెనర్జీ అన్నారు. బిజెపియేతర కూటమి దేశప్రజలందరి కోసం నిలబడుతుందని అన్నారు. 

బిజెపి వ్యతిరేక కూటమి గెలిస్తే అిద ప్రజల ప్రభుత్వమవుతుందని, ప్రజల కోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వమవుతుందని ఆమె అన్నారు. ఒమర్ యువ నాయకుడని, ఒమర్ ఇక్కడికి రావడం ఎంతో గొప్ప విషయమని, దేశ నాయకుడిగా ఆయన ఎదగడాన్ని చూడాలని అనుకుంటున్నానని మమత అన్నారు.

click me!