సలాం కలాం.. వెల కట్టలేని భారత ‘’రత్నం’’

First Published Jul 27, 2018, 6:52 PM IST
Highlights

శత్రువులు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికేలా మిస్సైల్లను అందించి.. పేదవాడి గుండెకు తక్కువ ధరకు స్టెంట్లను ఇచ్చి.. కలలు కనండి ఆ కలలను నిజం చేసుకోండి అంటూ యువతను ప్రేరేపించినా.. దేశాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అత్యంత సాధారణ జీవితం గడిపి ప్రజల రాష్ట్రపతిగా మన్ననలు అందుకున్నారు మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత ఏపీజే అబ్ధుల్  కలాం

శత్రువులు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికేలా మిస్సైల్లను అందించి.. పేదవాడి గుండెకు తక్కువ ధరకు స్టెంట్లను ఇచ్చి.. కలలు కనండి ఆ కలలను నిజం చేసుకోండి అంటూ యువతను ప్రేరేపించినా.. దేశాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అత్యంత సాధారణ జీవితం గడిపి ప్రజల రాష్ట్రపతిగా మన్ననలు అందుకున్నారు మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత ఏపీజే అబ్ధుల్  కలాం.. ఆయన మరణించి మూడేళ్లు గడుస్తున్నా కలాం నింపిన స్పూర్తి ఇంకా దేశప్రజల మనసుల్లో రగులుతూనే ఉంది.

1931 అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబలో జన్మించిన అబ్ధుల్ కలాం దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల దృష్ట్యా చిన్నవయసులోనే కష్టపడాల్సి వచ్చింది. పాఠశాల  విద్య తర్వాత తండ్రికి చేదోడుగా ఉండటం కోసం పేపర్‌బాయ్‌గా పనిచేశారు. దీంతో చదువులో తక్కువ మార్కులు వచ్చేవి..

అయినప్పటికీ నేర్చుకోవాలనే తపన ఆయనలో ఉండేది.. చదువు కోసం ఎక్కువ సమయం కష్టపడేవారు.. ఆయన ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు. పాఠశాల విద్య తరువాత తిరుచ్చిలోని సెయింట్‌ జోసెఫ్ కళాశాల నుంచి 1954లో ఫిజక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు.  1958లో మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టాను అందుకున్నారు.

ఈ సమయంలో ఆయన ప్రాజెక్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన డీన్ సరిగా చేయని పక్షంలో స్కాలర్‌షిప్ ఎత్తేస్తాను అని హెచ్చరించడంతో ఆయన ఇచ్చిన గడువులోగా కష్టపడి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి శెభాష్ అనిపించుకున్నారు. పైలట్‌గా యుద్ధ విమానాన్ని నడపాలన్నది ఆయన కల.. కానీ విధి ఆయనను శాస్త్రవేత్తను చేసింది. ప్రవేశపరీక్షలో తక్కువ మార్కులు రావడంతో పైలట్ కావాలనే కలను తృటిలో కోల్పోయారు.

బాధతో కృంగిపోకుండా డీఆర్‌డీవోలో చేరారు.. భారత సైన్యం కోసం ఒక తేలికపాటి హెలికాఫ్టర్‌ను తయారు చేసిన కలాంకు అక్కడ సంతృప్తి దొరకలేదు.. దీంతో తన మకాన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌(ఇస్రో)కు మార్చారు. భారత్ రూపొందించిన తొలి స్వదేశీ ఉపగ్రహం రోహిణి కోసం పనిచేసి.. దానిని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆయనలోని ప్రతిభను గుర్తించిన నాటి రక్షణమంత్రి ఆర్.వెంకటరామన్‌ దేశభద్రతకు మిస్సైల్స్‌ను రూపొందించాలని కలాంను కోరారు..

ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి రూపకల్పన చేసిన రామన్ దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌‌గా అబ్డుల్ కలాంను నియమించారు. ఆయన పర్యవేక్షణలో అగ్ని, పృథ్వీ వంటి బాలిస్టిక్ మిస్సైల్స్‌ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. అనంతరం అగ్రరాజ్యాల కళ్లుగప్పి ప్రోఖ్రాన్‌లో అణుపరీక్షలు విజయవంతంగా జరిపారు. వయసు రీత్యా రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆయన మచ్చలేని వ్యక్తిత్వం కారణంగా అప్పటి  ప్రధాని వాజ్‌పేయ్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

ఈ ప్రతిపాదనను తొలుత కలాం సున్నితంగా తిరస్కరించినప్పటికీ.. ప్రధాని వాజ్‌పేయ్‌తో పాటు మేధావులు ఒప్పించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతిగా నామినేషన్ వేశారు. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆ పదవికే వన్నె తెచ్చారు.. రాష్ట్రపతి నిలయాన్ని ప్రజలకు దగ్గర చేశారు. ఆయనకు ఎవరైనా ఉత్తరం రాస్తే.. దానికి స్వయంగా జాబు రాసేవారు. అలా ఒకసారి నమాన్ నరైన్ అనే చిత్రకారుడు కలామ్ చిత్రపటాన్ని గీసి పంపితే.. దానికి ఎంతో సంతోషించిన కలామ్ స్వంతదస్తూరీతో ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు.

దేశాధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన వెంటనే తను ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తాన్ని పురా అనే ట్రస్టుకు రాసిచ్చేశారు. మరణించే నాటికి కలామ్ దగ్గరున్న ఆస్తి..25 వందల పుస్తకాలు.. ఒక చేతి గడియారం.. ఆరు చొక్కాలు.. నాలుగు ప్యాంట్లు, ఒక జత బూట్లు మాత్రమే. ఎప్పుడు తీరిక దొరికినా ఖురాన్‌తో పాటు భగవద్గీతలోని శ్లోకాలు చదువేవారు. 84 ఏళ్ల వయసులోనూ నిత్య యువకుడిగా నవతరానికి స్పూర్తి నింపుతూ యువతను మేల్కోలిపేలా ఉపన్యాసాలు ఇచ్చేవారు.

పిల్లలను అమితంగా ప్రేమించే కలాం చివరి నిమిషం వరకు పిల్లలతోనే గడిపేవారు. జీవితంలో ఎన్నో చూసిన మీకు ఎలా ఉండటం అంటే ఇష్టం అని అడిగితే  ‘‘విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా ’ ఉండటం అంటే ఇష్టమని చెప్పేవారట. చివరి శ్వాస వరకు దేశ అభ్యున్నతి కోసం శ్రమించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.. 2015 జూలై 26న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ కలాం కుప్పకూలిపోయారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 27న యావత్ దేశాన్ని విషాదంలో ముంచెత్తుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కల్మషం లేని చిరు నవ్వుతో.. నిత్యం స్ఫూర్తి  నింపి..ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్త్వానికి కట్టుబడి జీవితాన్ని సాగించిన కలాం జీవితం ఎందరికో ఆదర్శం.. 20వ శతాబ్ధిలో మహాత్మాగాంధీ తర్వాత దేశాన్ని అంతగా ప్రభావితం చేసిన వారిలో అబ్ధుల్ కలాం ముందువరుసలో ఉంటారు. వి మిస్ యూ ‘‘ మిస్సైల్  మ్యాన్ ఆఫ్ ఇండియా’’.

click me!