
ఈ ఘటనకు మూల కారణం టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ మరణం. అవినీతి, వసూళ్ల కేసులో అరెస్టైన ఆయన పోలీసు కస్టడీలో ఉండగానే అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే బిర్జు కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు తీవ్రంగా హింసించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని కలిసేందుకు మమతా బెనర్జీ హలీషహర్‌కు వెళ్లారు.
మమతా బెనర్జీ కాన్వాయ్ హలీషహర్ చేరుకోగానే నిరసనకారులు వాహనాలను చుట్టుముట్టారు. కాన్వాయ్‌పై రాళ్లు, నీటి బాటిళ్లు, చెప్పులు విసిరారు. కొన్ని వాహనాలపై బురద కూడా చల్లారు. అంతేకాకుండా మమతాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఘటన అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ, తన కారుపై పెద్ద రాళ్లు విసిరారని, కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్ర గాయాలు అయ్యేవని అన్నారు. పోలీసులు తమ ముందే దాడి జరిగినా అడ్డుకోలేదని, బీజేపీకి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఇది ముందస్తుగా పన్నిన హత్యాయత్నమని ఆరోపించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఈ ఆరోపణలను ఖండించారు. రాళ్లు, చెప్పులు విసరడం వంటి ఘటనలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను బీజేపీ ఎప్పుడూ సమర్థించదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బిర్జు కియోట్ మృతి గుండెపోటుతో జరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు మాత్రం కస్టడీలో హింస వల్లే మరణించాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు టీఎంసీ పోలీసులపై చర్యలు కోరుతుండగా, మరోవైపు బీజేపీ పారదర్శక విచారణ జరగాలని కోరుతోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతోంది.