ఆర్యన్ ఖాన్ కేసులో అనూహ్య ట్విస్ట్.. సాక్షి సంచలన ఆరోపణలు.. 18 కోట్ల డీల్.. నాకు ప్రాణ హాని

By telugu team  |  First Published Oct 24, 2021, 3:17 PM IST

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు వచ్చింది. ఈ కేసు పంచనామాలో సాక్షిగా సంతకం చేసిన కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి రూ. 18 కోట్ల డీల్ తాను విన్నారని, ఇందులో రూ. 8 కోట్లు ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్  వాంఖేడ్‌కు ఇవ్వాల్సి ఉంటుందనే సంభాషణలూ విన్నట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సమీర్ వాంఖేడ్ తోసిపుచ్చారు.
 


ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన Bollywood బాద్ షా Shah Rukh Khan తనయుడు Aryan Khan Drugs Caseలో అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసు పంచనామాలో సాక్షిగా సంతకం చేసిన ఓ వ్యక్తి రివర్స్ అయ్యాడు. ఈ కేసులో డ్రగ్స్ రికవరీ చేశారా? లేదా? అనేది తనకు తెలియదని అన్నారు. పది బ్లాంక్ పేపర్‌లపైనే తన సంతకం తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి భారీగా మొత్తం చేతులు మారిందని ఆరోపించారు. తాను 18 కోట్ల Deal గురించి విన్నట్టు వివరించారు. 

సాధారణంగా పెద్ద పెద్ద కేసుల్లో witnesses హతమవ్వడం లేదా కనిపించకుండా పోవడం చూస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. అదే తరహాలోనూ తనకూ ప్రాణ హానీ ఉన్నదని తెలిపారు. ఇన్ని విషయాలు తెలిసిన తనను ఎన్‌సీబీ అధికారి ఊరికే వదిలిపెట్టబోడని భయపడుతున్నట్టు వివరించారు. కాబట్టి, తనకు తెలిసిన నిజాలన్నింటినీ బయటపెట్టి తన ప్రాణాలు రక్షించుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు నోటరీ చేసిన ఓ అఫిడవిట్‌లో సాక్షి ప్రభాకర్ సాయిల్ పేర్కొన్నారు. ఈయన ప్రైవేటు డిటెక్టివ్‌గా పేర్కొంటున్న కేపీ గోసావి(ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత ఆయనతో తీసుకున్న గోసావి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే) బాడీగార్డ్. కొంతకాలంగా కేపీ గోసావి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆయన కోసం ఇప్పటికే లుకౌట్ ఆదేశాలు జారీ
అయ్యాయి. తమ బాస్ కేపీ గోసావీనే మిస్ అయ్యాడని, తన ప్రాణాని భద్రత లేదని ప్రభాకర్ పేర్కొన్నారు. 

Latest Videos

undefined

Also Read: ఆర్యన్ ఖాన్‌కు అనన్య పాండే గంజాయి అందించిందా? ఎన్‌సీబీకి ఆమె ఏం చెప్పింది?

ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ అర్బాజ్ మెర్చంట్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొనే పత్రంలో కేపీ గోసావి, ఆయన బాడీగార్డ్ సాయిల్ సాక్షులుగా ఉన్నారు.

శామ్ డిసౌజా అనే వ్యక్తితో కేపీ గోసావి రూ. 18 కోట్ల డీల్ గురించి మాట్లాడుతుండగా తాను విన్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. ‘మీరు 25 కోట్ల బాంబు పెట్టారు. దీన్ని రూ. 18 కోట్లకు సెటిల్ చేసుకుందాం. ఇందులో రూ. 8 కోట్లు సమీర్ వాంఖెడ్‌(ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్)కు ఇవ్వాలి’ అనే సంభాషణను సాయిల్ పేర్కొన్నారు. ఆ తర్వాతే గోసావి ఎన్‌సీబీ కార్యాలయానికి వెళ్లారని చెప్పారు. ఆ సంభాషణ తర్వాత కొన్ని నిమిషాలకు పూజా దద్లాని(షారూఖ్ ఖాన్ మేనేజర్) కేపీ గోసావితో మాట్లాడుతుండగా చూశామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ లొకేషన్ చెప్పి అక్కడికి వెళ్లి రూ. 50 లక్షల నగదు కలెక్ట్ చేసుకోవాలని తనను గోసావి ఆదేశించినట్టు వివరించారు. వెంటనే తాను రెండు బ్యాగుల్లో ఆ సొమ్ము తీసుకుని గోసావికి అందించినట్టు తెలిపారు.

ఎన్‌సీబీ ఆఫీసు నుంచి తాము లోయర్ పరేల్‌కు చేరగానే స్పాట్‌లో ఓ బ్లూ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారు ఉన్నదని, అందులో పూజా దద్లాని కూర్చుని ఉన్నారని వివరించారు. శామ్ డిసౌజా, కేపీ గోసావి, పూజా దద్లాని కారులో కాసేపు మాట్లాడుకున్నారని, 15 నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయామని ప్రభాకర్ సాయిల్ వివరించారు. వాషి చేరుకున్నాక మరో అడ్రస్ చెప్పి రూ. 50 లక్షలు కలెక్ట్ చేసుకోవాలని కేపీ గోసావి పురమాయించారని పేర్కొన్నారు. ఇండియానా హోటల్ సమీపంలోని టార్డియో సిగ్నల్ దగ్గర రెండు బ్యాగుల్లో డబ్బులు తీసుకుని కిరణ్ గోసావికి ఇచ్చేశానని వివరించారు.

Also Read: Aryan Khan: ఆర్యన్ ఖాన్‌కు మనీ ఆర్డర్.. షారూఖ్ ఖాన్‌తో వీడియో కాల్

ఇప్పుడు గోసావి మిస్ అయ్యాడని, ఇన్ని విషయాలు తెలిసిన తనను ఎన్‌సీబీ అధికారులు వదిలిపెట్టబోరని ప్రభాకర్ సాయిల్ పేర్కొన్నారు.

అయితే, సాక్షి ప్రభాకర్ సాయిల్ ఆరోపణలను ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ వాంఖెడ్ కొట్టిపారేశారు. అవన్నీ అర్థరహితమైనవని పేర్కొన్నారు. అందరికీ సరైన సమయంతో దీటైన జవాబు చెబుతారని తిప్పికొట్టారు. అవసరమైతే ఆ అఫిడవిట్‌ను ఎన్‌డీపీఎస్ కోర్టులో సమర్పించినా సరే.. అక్కడ వాటికి సమాధానమిస్తామని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఆరోపణలన్నీ ఎన్‌సీబీ ప్రతిష్టను దిగజార్చడానికేనని కొట్టిపారేశాయి.

click me!