కంగనా రనౌత్‌పై మహాత్మా గాంధీ మునిమనవడు ఫైర్.. ‘పిరికిపందలు ఎవరంటే?’

By telugu team  |  First Published Nov 18, 2021, 12:51 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వాతంత్ర్యం గురించి, మహాత్మా గాంధీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. వీటిపై తాజాగా మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపెట్టడానికి ఎంతో ధైర్యం అవసరం ఉంటుందని, గాంధేయ వాదులను ద్వేషించే వారికి అంత ఆలోచన లేదని పేర్కొన్నారు. అంతేకాదు, పరోక్షంగా సావర్కర్‌ను పేర్కొంటూ ఆయన నీడలో తిరగాలనుకుంటున్న ఇలాంటి వారే పిరికిపందలు అంటూ ధ్వజమెత్తారు. 
 


న్యూఢిల్లీ: దేశ స్వాతంత్ర్యం, Mahatma Gandhi, ఆయన చేపట్టిన అహింసా విధానాలపై Bollywood నటి Kangana Ranaut చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలపై BJP సహా చాలా పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఆమె తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ తరుణంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మహాత్మా గాంధీ ముని మనవడు Tushar Gandhi స్పందించారు. ఓ వ్యాసంలో ఆమెపై ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీపై ద్వేషం చిమ్మే వారి ఆలోచనల స్థాయి కంటే కూడా మరో చెంపను చూపెట్టడానికి ఎక్కువ ధైర్యం అవసరం ఉంటుందని విమర్శలు చేశారు. మహాత్మా గాంధీ తీరునూ.. స్వాతంత్ర్య సమరంపై కంగనా చేసిన వ్యాఖ్యలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

1947లో భారత్‌కు భిక్షం లభించిందని, నిజమైన స్వాతంత్ర్యం దేశానికి 2014లోనే వచ్చిందని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 2014లో నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కంగనా రనౌత్ తన పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేయాలని, కొందరు ఇంకొందరు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆ అవార్డును ఉపసంహరించాలనే డిమాండ్లూ వచ్చాయి. ఈ వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో కంగనా రనౌత్ తన వ్యాఖ్యలకు సమర్థనలూ జోడిస్తూ వస్తున్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీల మధ్య ప్రస్తావిస్తూ మీరు ఎవరి మద్దతుదారులో జాగ్రత్తగా ఎంచుకోండని ఆమె అభిప్రాయాలను ఏకరువు పెట్టారు.

Latest Videos

undefined

Also Read: Netaji: మహాత్మా గాంధీ.. సుభాష్ చంద్రబోస్‌ల మధ్య కఠిన సంబంధాలు: నేతాజీ కూతురు అనితా బోస్

తాజాగా, కంగనా రనౌత్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ తుషార్ గాంధీ ఓ వ్యాసం రాశారు. అందులో మహాత్మా గాంధీ అనుయాయులు ఒక చెంపై పై కొడితే మరో చెంప చూపెడతారని, ఇది పిరికి చర్యగా కొందరు చిత్రిస్తున్నారని, వారికి తెలియని ఏమంటే.. మరో చెంప చూపెట్టడం సాహస కార్యం అని పేర్కొన్నారు. గాంధేయ వాదులు కేవలం మరో చెంప చూపిస్తారని ఆరోపణలు చేసే వారే పిరికిపందలు అని తెలిపారు. ఎందుకంటే మరో చెంప చూపెట్టడానికి ఎంతో ధైర్యం అవసరం అని వివరించారు. అలాంటి హీరోయిజాన్ని వారు అర్థం చేసుకోలేరని, కానీ, మనమంతా ఆ విషయాన్ని మరిచిపోవద్దని పేర్కొన్నారు.

మరో చెంప చూపెట్టడం ఎంతో ధైర్యంతో కూడుకున్న పని అని, స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది భారతీయులు ఈ పని చేశారని తుషార్ గాంధీ వివరించారు. వారంతా హీరోలేనని పేర్కొన్నారు. తన స్వప్రయోజనాల కోసం రెప్పపాటు కాలమైనా ఆలోచించకుండా బ్రిటీష్ వారికి క్షమాభిక్ష కోరుతూ లేఖ రాసిన వారినే గురువులుగా తలుస్తున్నవారే అసలైన పిరికిపందలు అని ఆరోపణలు చేశారు. బ్రిటీష్ వారికి క్షమాభిక్ష రాశాడని సావర్కర్‌పై ఇటీవలే చర్చ జరిగింది. మహాత్మా గాంధీ సూచనల మేరకే సావర్కర్ క్షమాభిక్ష రాశాడని ఇటీవలే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Also Read: ‘నా పద్మ శ్రీ అవార్డు తిరిగి ఇచ్చేస్తా.. కానీ’.. కంగనా రనౌత్ మరోసారి ఫైర్.. ప్రశ్నల వర్షం

బాపు తనను భిక్షువుగా పేర్కొన్న దాన్ని ఆహ్వానించేవారేనని తుషార్ గాంధీ పేర్కొన్నారు. దేశహితం కోసం, దేశ ప్రజల కోసం భిక్షువుగా పిలవబడటానికి ఆయన తిరస్కరించేవాడు కాదని వివరించారు. అర్ధ నగ్న ఫకీరుగా అప్పటి బ్రిటీష్ ప్రధాని విమర్శలు చేసినా మహాత్మా గాంధీ తప్పు పట్టలేదని ప్రస్తావించారు.

అబద్ధాలు ఎంత బిగ్గరగా అరిచి చెబుతున్నా.. సత్యాలను మితస్వరంతో మాట్లాడుతున్నా.. నిజమే ఎప్పటికీ నిలుస్తుందని తుషార్ గాంధీ తెలిపారు. అబద్ధాలు ఎక్కువ కాలం నిలవాలంటే ఎప్పటికప్పుడు మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవలి రోజుల్లోనే ఇలాంటి అబద్ధాలు వింటున్నామని, అయితే, కొన్ని అబద్ధాలకు స్పందించాల్సిన అవసరము ఉందని వివరించారు. 1947లో భిక్షం లభించిందన్న కంగనా వ్యాఖ్యలకూ ఆయన కౌంటర్ ఇచ్చారు. వేలాది మంది స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను, సాహసాలను అవహేళన చేసినట్టు అవుతుందని మండిపడ్డారు.

click me!