
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ కలిగించాయి. మళ్లీ అంతలోనే గాడిలో పడుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే చక్రం తిప్పినట్టు తెలుస్తున్నది. మళ్లీ పరిస్థితులను నిజంగానే శివసేన తమ అదుపులోకి తెచ్చుకున్నట్టు అర్థం అవుతున్నది. గుజరాత్‌లో మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో శివసేన ఎమ్మెల్యేలు క్యాంప్ వేశారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోతుందా? అనే చర్చలు జరిగిన సందర్భంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం జరుగుతుండగా కూడా ఏక్‌నాథ్ షిండేను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఆఫర్ చేసినట్టు కొన్ని వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో శివసేన ఎమ్మెల్యేలు అనుకున్నదాని కంటే ఎక్కువ మంది హాజరు అయినట్టు తెలిసింది. అదే విధంగా ఏక్‌నాథ్ షిండేపైనా శివసేన వేటు వేసింది. పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి ఆయనను తొలగించింది. ఏక్‌నాథ్ షిండే స్థానంలో శివసేన ఎమ్మెల్యే అజయ్ చౌదరిని కొత్త శాసన సభా పక్ష నేతగా భర్తీ చేసింది.
ఇదిలా ఉండగా, పార్టీ చీఫ్ విప్‌గా ఏక్‌నాథ్ షిండేను తొలగించిన సమయంలోనే కాస్త అటూ ఇటూగా ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. తాము బాలాసాహెబ్ శివ సైనికులను ట్వీట్ చేశారు. బాలా సాహెబ్ తమకు హిందూత్వను నేర్పారని వివరించారు. బాలాసాహెబ్ ఆలోచనలు, ధరమ్ వీర్ ఆనంద్ దిగే బోధనలు నేర్చుకున్నామని తెలిపారు. తాము అధికారం కోసం ఎట్టి పరిస్థితుల్లో చీటింగ్ చేయబోమని స్పష్టం చేశారు.
ఈ ట్వీట్‌కు కొంత సమయం ముందే శరద్ పవార్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, మహా వికాస్ అఘాదీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. అదంతా శివసేన పార్టీ అంతర్గత వ్యవహారం అని, ప్రభుత్వంలో ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదని వివరించారు.
ఇదిలా ఉండగా, గుజరాత్‌లో క్యాంప్ వేసుకున్న శివసేన ఎమ్మెల్యేలను కలవడానికి గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుటే వెళ్లారు.
ఏక్‌నాథ్ షిండే సహా 22 మంది శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్ హోటల్‌లో క్యాంప్ వేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తాము వారిలో కొందరితో సంప్రదించగలిగామని, పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నాయని సంజయ్ రౌత్ అన్నారు. కానీ, ప్రభుత్వమే కూలిపోతుందా? అనే సంశయాలు వచ్చిన తరుణంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు సత్యదూరంగా కనిపించాయి. అయితే, ఆ సంప్రదింపుల్లోనే కీలక నిర్ణయాలు బీజాలు పడినట్టుగా తెలుస్తున్నది.