Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. జనవరి 22న సెలవు ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్

By Siva Kodati  |  First Published Jan 19, 2024, 7:55 PM IST

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయంతో మహారాష్ట్ర కూడా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవాల సరసన చేరింది. ఈ రాష్ట్రాల్లో జనవరి 22న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయనున్నారు.


అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. రాములోరిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అలాగే పలువురు వీఐపీలకు కూడా ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు అందజేశారు. ఇక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తున్నాయి. 

తాజాగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. భారతదేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పారిశ్రామిక యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రి, బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోధా విజ్ఞప్తి మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న సెలవు ప్రకటించింది. 

Latest Videos

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయంతో మహారాష్ట్ర కూడా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవాల సరసన చేరింది. ఈ రాష్ట్రాల్లో జనవరి 22న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయనున్నారు. అంతేకాదు.. ఈ రాష్ట్రాలు ఆరోజున మద్యం, మాంసం, చేపల అమ్మకాలపై నిషేధం కూడా విధించింది. ఈశాన్య రాష్ట్రం త్రిపురలోనూ అన్ని కార్యాలయాలు, విద్యాసంస్థలు జనవరి 22 మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేయనున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా హాఫ్ డే సెలవు ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయని సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ జనవరి 22ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. జనవరి 22న , అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సంస్థలు మూసివేయబడతాయని ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి వెల్లడించారు. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవు జాబితా ప్రకారం ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిదినంగా గుర్తించబడతాయి.  పరిమిత ఆహ్వానితులు, నాయకులు, ప్రముఖుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డాయి. 
 

click me!