
న్యూఢిల్లీ: మహరాష్ట్ర కొత్త గవర్నర్ గా రమేష్ బైస్ ను నియమించారు. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేశారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు.
మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన భగత్ సింగ్ కోష్యారి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. దరిమిలా మహరాష్ట్ర కొత్త గవర్నర్ గా రమేష్ బైస్ ను నియమించారు.
తన చివరి కాలమంతా చదవడం, రాయడం వంటి కార్యక్రమాల్లో గడపాలని కోష్యారీ భావిస్తున్నందున గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
గతంలో ఎంపీగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కోష్యారీకి ఉంది. 2019లో మహరాష్ట్ర గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు. భగత్ సింగ్ కోష్కారీ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి.
ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణానికి ముందే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎంగా ప్రమాణం చేయించిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గవర్నర్ తీరుపై బీజేపీయేతర పార్టీలు తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే .
also read:ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
మహరాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టిన తర్వాత గవర్నర్ కోష్యారీకి మధ్య వివాదాలు సాగాయి. కరోనా తర్వాత ఆలయాల తిరిగి ప్రారంభించడం కోష్యారీ డెహ్రడూన్ టూర్ కు ఠాక్రే ప్రభుత్వం విమానం తిరస్కరించడం వంటి పరిణామాలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అంతేకాదు ముంబైలోని సకినాడలో మహిళపై అత్యాచారం, హత్య ఘటన పై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.