మెట్టుదిగిన బీజేపీ: సీఎం కుర్చీపై శివసేనకు రాయబారం

By sivanagaprasad KodatiFirst Published Nov 18, 2019, 6:15 PM IST
Highlights

మహారాష్ట్ర రాజకీయం మహా మలుపులు తిరుగుతోంది. అధికారాన్ని పంచుకునేందుకు కేంద్రమంత్రి అథవాలేతో శివసేనకు బీజేపీ రాయబారం పంపింది బీజేపీ

మహారాష్ట్ర రాజకీయం మహా మలుపులు తిరుగుతోంది. అధికారాన్ని పంచుకునేందుకు కేంద్రమంత్రి అథవాలేతో శివసేనకు బీజేపీ రాయబారం పంపింది బీజేపీ. ముఖ్యమంత్రి పదవిని మూడేళ్లు బీజేపీ.. ఆ తర్వాత రెండేళ్లు శివసేనకు ఇచ్చేందుకు సిద్ధమని అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు రామ్‌దాస్ అథవాలే ఫోన్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత కలిగించింది. 

మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు, శివసేనకు మద్ధతు తదితర పరిణామాలపై వీరు చర్చించనున్నారు.

కాంగ్రెస్‌తో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదన్నారు శరద్ పవార్.. సోనియా గాంధీతో భేటీ ముగిసిన అనంతరం పవార్ మీడియాతో మాట్లాడుతూ.. శివసేనతో కూడా ఇంకా చర్చలు జరపలేదన్నారు. తమకు మద్ధతిచ్చే పార్టీలతో ఇంకా మాట్లాడాల్సి వుందని, పరిష్కరించుకోవాల్సిన అంశాలు తమ ముందు చాలా ఉన్నాయని పవార్ తెలిపారు. 

అంతకుముందు సోనియాతో భేటీకి ముందు ప్రభుత్వ ఏర్పాటు అంశంపై మీడియాతో మాట్లాడిన పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనా అని ఓ విలేకరి ఆయనను ప్రశ్నించారు.

Also read:ఎన్సీపీ, సేన, కాంగ్రెస్‌ల మధ్య అధికార పంపకాలు ఇలా

దీనికి స్పందించిన ఆయన.. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి పోటీ చేశాయని, ఎవరి రాజకీయాలు వారు చేస్తారని చెప్పారు. అదే సమయంలో ఎన్సీపీతో చర్చిస్తున్నట్లు శివసేన చెబుతోంది కదా అని మరొకరు అడగ్గా.. అవునా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో మీడియా ప్రతినిధులు సైతం అవాక్కయ్యారు. 

తాము ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన కొద్దిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో పవార్ వ్యాఖ్యలు కొత్త అనుమానాలను రేకేత్తిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై సోనియా గాంధీతో చర్చించిన అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలు ఓ ప్రకటన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also read:కాంగ్రెసు "మహా" షాక్: సోనియా గాంధీపై శరద్ పవార్ అసంతృప్తి

ఇదే సమయంలో మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారిపై శివసేన మండిపడింది. వరదలతో దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్రం జాప్యం చేస్తోందని.. తమకు ఓటు వేయని రైతులపై కేంద్రం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడరాదంటూ తన అధికారిక పత్రిక సామ్నాలో శివసేన చురకలు అంటించింది. అలాగే గవర్నర్‌ని రాజాగా అభివర్ణించిన శివసేన.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు రాజా మోకాలడ్డుతున్నారని ఆరోపించింది.

click me!