ముంబైలో ఇండియా కూటమి సమావేశం.. పాల్గొననున్న మహా వికాస్ అఘాడీ నేతలు, బాధ్యతలు అప్పగింత

Siva Kodati |  
Published : Aug 24, 2023, 08:25 PM IST
ముంబైలో ఇండియా కూటమి సమావేశం.. పాల్గొననున్న మహా వికాస్ అఘాడీ నేతలు, బాధ్యతలు అప్పగింత

సారాంశం

వచ్చే వారం ముంబైలో జరగనున్న ఇండియా కూటమి మూడవ సమావేశానికి మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి హాజరుకానుంది. ఇండియా కూటమి సమావేశానికి ముందు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల ఫార్ములాపై చర్చించడానికి ఎన్‌సీపీ ఆసక్తిని వ్యక్తం చేసింది. 

ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాట్నా, బెంగళూరులలో ఈ కూటమి సమావేశమైంది. తాజాగా వచ్చే వారం ముంబైలో మూడో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి హాజరుకానుంది. ఇందులో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (యూబీటీ)తో కూడిన నాయకులు పాల్గొననున్నారు. ఆగస్ట్ 31,  సెప్టెంబర్ 1న ముంబైలో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. 

నిన్న ముంబై శాంతాక్రజ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. దీనికి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, అశోక్ చవాన్, మిలింద్ దేవరా, వర్షా గైక్వాడ్, సంజయ్ నిరుపమ్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అలాగే సంజయ్ రౌత్, ఆదిత్య థాక్రే, సుప్రియా సూలే, జితేంద్ర అవద్, విశ్వజీత్ కదమ్, కపిల్ పాటిల్ కూడా వున్నారు. 

నివేదికల ప్రకారం.. ఇండియా కూటమి సమావేశానికి ముందు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల ఫార్ములాపై చర్చించడానికి ఎన్‌సీపీ ఆసక్తిని వ్యక్తం చేసింది. అయితే ఈ అంశాన్ని తొలుత జాతీయ స్థాయిలో పరిష్కరించాలా లేక రాష్ట్ర స్థాయిలోనా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి . నిన్నటి భేటీలో త్వరలో జరగనున్న ఇండియా కూటమికి సంబంధించిన బాధ్యతలు కేటాయించారు. శివసేన ప్రముఖులు స్వాగత ఏర్పాట్లు, వసతిని పర్యవేక్షించనున్నారు. మీడియా కవరేజీ, నిర్వహణను కాంగ్రెస్.. భద్రత, అనుమతులు తదితర కార్యక్రమాలను ఎన్సీపీ నేతలు నిర్వహించనున్నారు. 

వీరికి అదనంగా ఇద్దరు కన్వీనర్లను నియమించాలని నిర్ణయించారు. ఆగస్ట్ 30న శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేలు విలేకరుల సమావేశంలో ఇండియా బ్లాక్ లోగోను ఆవిష్కరించనున్నారు. 28 పార్టీలకు చెందిన 80 మంది నేతలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఇండియా బ్లాక్ మీటింగ్ సబర్బన్ హోటల్‌లో జరగనుంది. అలాగే దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు