సన్నిలియోన్‌కు మధ్యప్రదేశ్ హోం మంత్రి వార్నింగ్.. ఎందుకంటే..!

By Mahesh KFirst Published Dec 26, 2021, 7:06 PM IST
Highlights

మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆదివారం బాలీవుడ్ యాక్టర్ సన్నిలియోన్‌కు వార్నింగ్ ఇచ్చారు. మధుబాన్ మే రాధికా, జైసే జంగల్ మే నాచే మోర్ అనే పాటపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నదని అన్నారు. మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పి మ్యూజిక్ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే యాక్షన్ తీసుకుంటామని సన్నిలియోన్, సింగర్స్ షారిబ్, తోషిలను హెచ్చరించారు.

భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh) హోం మంత్రి నరోత్తం మిశ్రా(Home Minister Narottam Mishra) ఆదివారం యాక్టర్ సన్నిలియోన్‌(Sunny Leone)కు వార్నింగ్ ఇచ్చారు. సన్నిలియోన్‌తోపాటు సింగర్స్ షారిబ్, తోషిలను హెచ్చరించారు. వారు ఇటీవలే విడుదల చేసిన ‘మధుబాన్ మే రాధికా, జైసే జంగల్ మే నాచే మోర్’ మ్యూజిక్ వీడియో పట్ల వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. వారు మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పి మ్యూజిక్ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.

కొందరు అధర్ములు హిందూ మనోభావాలను గాయపరుస్తూనే ఉన్నారని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా అన్నారు. అలాంటి ఖండనార్హమైన ఘటనే ఇది కూడా. అందుకే సన్నిలియోన్, షారిబ్, తోషిలు అర్థం చేసుకోవాలని తాను వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పారు. మూడు రోజుల్లోగా వారు పాట పై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత పాటను తొలగించాలని అన్నారు. లేదంటే వారిపై యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హిందువులు రాధా దేవిని ఆరాధిస్తారని, ఈ సాంగ్ వారి మనోభావాలను గాయపరుస్తున్నాయని అన్నారు. గతవారం విడుదలైన ఈ పాటను షారిబ్, తోషిలు పాడారు. సన్నిలియోన్ నటించారు. ఈ పాటలోని కొన్ని పదాలు 1960లో వచ్చిన కోహినూర్ సినిమాలోని ‘మధుబాన్ మే రాధికా నాచే రే’ పాటతో కలుస్తున్నాయి. ఆ పాటను మొహమ్మద్ రఫీ పాడారు. దివంగత నటుడు దిలీప్ కుమార్ నటించారు.

Also Read: ఈశ్వర ఆలయంలో ముద్దు సీన్లు.. నెట్‌ఫ్లిక్స్‌పై ఎఫ్ఐఆర్

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పురోహితుడు ఈ పాటను నిషేధించాలని శనివారం డిమాండ్ చేశారు. మతపరమైన మనోభావాలను బాలీవుడ్ యాక్టర్ దెబ్బ తీస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాటలో అసభ్యకరంగా డ్యాన్స్‌లు ఉన్నాయని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా ఇలా వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. అక్టోబర్ నెలలోనూ జువెల్లరీ డిజైనర్ సభ్యసాచి ముఖర్జీకి వార్నింగ్ ఇచ్చారు. మంగళసూత్రాన్ని అభ్యంతరకరంగా చిత్రిస్తున్నారని, ఆ మంగళసూత్రాన్ని ప్రచారానికి వినియోగిస్తున్న చిత్రాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అందుకు 24 గంటల అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆ డిజైనర్ తన యాడ్స్‌ను వెనక్కి తీసుకున్నాడు.

అంతకు ముందూ డాబర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్‌పై ఇలాగే మండిపడ్డారు. స్వలింప సంపర్క జంట కర్వా చౌత్‌ను వేడుక చేసుకుంటున్న యాడ్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే కంపెనీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Also Read: పెయిడ్ న్యూస్ కేసులో మధ్య ప్రదేశ్ మంత్రిపై అనర్హత వేటు

ఓటీటీలో విడుదలైన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు నెటిఫ్లిక్స్ ప్రతినిధులపై భారతీయ యువ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ మధ్యప్రదేశ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేగాక పవిత్ర దేవాలయంలో ముద్దు సీన్‌లు చిత్రీకరించి మనోభావాలు దెబ్బతీసినందుకు నెట్‌ఫ్లిక్స్‌ హిందువులకు క్షమాపణ చెప్పాలని తివారీ డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర ఆలయంలో ఈ ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని తివారి ధ్వజమెత్తారు. అంతేగాక ఇది లవ్ జిహాద్‌ను కూడా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.

గౌరవ్ తివారీ ఫిర్యాదు మేరకు నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోనికా షెర్గిల్‌, పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంబికా ఖురాలనా ఐపీసీ 295 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరొత్తం మిశ్రా తెలిపారు.

click me!