కంటతడి పెట్టిస్తున్న చాయ్‌వాలా ఆత్మహత్య.. తొలుత కొవిడ్, తర్వాత బుల్‌డోజర్ దెబ్బతో విలవిల్లాడి.. !

By Mahesh KFirst Published Jan 22, 2023, 4:20 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో 55 ఏళ్ల చాయ్ అమ్ముకునే వ్యక్తి అప్పుల బాధకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ‘ఇక్కడ నా గోడు వినేవారెవరూ లేరు. నేనేం చేయాలి? నాకు ఆత్మహత్యే శరణ్యం’ అని తాను రాసుకున్న కాగితం ముక్క ప్యాంట్ జేబులో కనిపించింది. కాలు రాయ్ ఆత్మహత్య కలవరం పెడుతున్నది.
 

భోపాల్: ఆయన సాదాసీదా మనిషి. నిజాయితీగా మెదిలేవాడు. టీ అమ్ముకుని బతుకు బండిని లాగేవాడు. అతనికి ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు. కొడుకు కూడా తండ్రికి పనిలో సహాయపడేవాడు. పేద కుటుంబం, ఆపదలకు తెచ్చిన అప్పులు కుప్పలైపోతున్నాయి. అయినా, చాయ్ అమ్మి వాటిని తీర్చగలననే అనుకున్నాడు. కానీ, కరోనా మహమ్మారి ఆయన బతుకుదెరువు మీద దెబ్బతీసింది. కొవిడ్ దెబ్బతో వ్యాపారం సాగలేదు. మహమ్మారి వెనుకడుగు వేయడం, లాక్‌డౌన్‌లు ఎత్తేయడంతో కొంత ప్రాణం లేసొచ్చింది. ముందటి స్థాయిలో వ్యాపారం పుంజుకోకముందే మరో ఆటంకం ఎదురైంది. ఈ సారి ప్రభుత్వం ఆయన ఆయువుపట్టు మీద దెబ్బతీసింది. అక్రమ నిర్మాణాల నిర్మూలన పేరిట కూడలిలో ఉన్న తన చాయ్ దుకాణాన్ని బుల్ డోజర్‌తో కూల్చేసింది. ఆ బుల్ డోజర్ తన భవిష్యత్‌ను, తన కుటుంబాన్నే నేలమట్టం చేసినంతగా బాధపడ్డాడు.

కానీ, తాను ఒక్కడు కాదు. భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు తనకు బాధ్యతగా ఉన్నారు. వారి కోసమే జీవించాలని తనను తాను కూడదీసుకుని టీ స్టాల్ కూల్చేసిన కూడలిలో ఓ బండి పై చాయ్ అమ్మడం మళ్లీ మొదలు పెట్టాడు. కానీ, సఫలం కాలేకపోయాడు. విలవిల్లాడిపోయాడు. జీవితంలో తాను ఓడిపోయాడా? ఓడించారా? ఈ మీమాంస పక్కనపెడితే అతనిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. బతుకు పై ఆశ కోల్పోయాడు. కుటుంబ బాధ్యతలు, అప్పులతో భవిష్యత్ అంధకారమైంది. దీంతో ఆత్మహత్య చేసుకునే తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నాడు. దాదాపు ఇదే సారాన్ని ఆయన జేబులో లభించిన కాగితం ముక్క చెబుతున్నది. 

Also Read: ఇండియా: ది మోడీ కొశ్చన్.. ఆ బీబీసీ డాక్యుమెంటరీ ట్వీట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం!

మధ్యప్రదేశ్‌లోని జైసినగర్‌కు చెందిన 55 ఏళ్ల కాలు రాయ్ వ్యథ ఇది. టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని వెల్లదీసిన కాలు రాయ్ నిన్న రాత్రి రోజూ చాయ్ అమ్మే దగ్గరి చెట్టుకే ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఆయన ప్యాంట్ జేబులో కనిపించిన కాగితం ముక్క.. అతడు జీవించి ఉండగా అనుభవించిన చిత్రవధను వెల్లడిస్తున్నది. ఆయన ఆత్మహత్య స్థానికులను కలవరపెట్టింది.

అప్పులు అంతకంతకు పెరుగుతున్నాయని, ఇక వాటిని తాను ఎంతమాత్రం భరించే స్థితిలో లేనని కాలు రాయ్ పేర్కొన్నాడు. ‘నా గోడును ఎవరు వినడం లేదు. నేనేం చేసేది? నాకు ఒక్కటే దారి ఉన్నది: ఆత్మహత్య’ అని కాలు రాయ్ ఆ కాగితం ముక్కపై రాసుకున్నాడు.

కరోనా మహమ్మారి కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది కటిక పేదరికంలో నెట్టివేయబడ్డారని గతేడాది విడుదలైన వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఇందులో 79 శాతం మంది కేవలం మన దేశం నుంచే ఉన్నట్టు ఆ రిపోర్టు వివరించింది. అత్యధిక జనాభా చైనాలో ఉన్నప్పటికీ ప్రపంచ పేదరికంలో భారత దేశానికే ఎక్కువ వాటా ఉన్నది.

click me!