
Maan Ki Baat: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ 2022 ఏడాదికిగాను తన తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది ఇదే తొలి రేడియో ప్రసంగం కావడంతో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టామని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. నివాళి అర్పించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలిండియా రేడియో ద్వారా తన మనసులో మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు.
ఇండియాగేట్ సమీపంలోని అమర్‌జవాన్ జ్యోతిని, నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరున్న అమరవీరుల జ్యోతిని ఇటీవల కలిపేశారని, ఆ ఉద్విగ్న సమయంలో దేశ ప్రజలు, అమరవీరుల కుటుంబాల కండ్లు చెమర్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన ప్రసంగంలో, మోడీ దేశంలోని యువత నుండి కోటి పోస్ట్‌కార్డ్‌లను స్వీకరించడం మరియు ఇటీవల మరణించిన కాలర్‌వాలి పులితో సహా వివిధ అంశాలపై మాట్లాడారు.
‘మన్ కీ బాత్’లోని ముఖ్యాంశాలు
ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతిని, నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరున్న అమరవీరుల జ్యోతిని విలీనం చేయడాన్ని చూశామనీ, ఈ రెండు జ్యోతుల విలీనం అమరవీరులకు గొప్ప నివాళిగా పేర్కొంటూ తనకు పలువురు రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది ఉత్తరాలు రాశారని ప్రధాని అన్నారు. అలాగే..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ వార్ మెమోరియల్‌ను సందర్శించాలని ప్రధాని కోరారు.
దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా పిల్లలు తనకు లేఖలు రాశారని ప్రధాని మోడీ తెలిపారు. ఆ ఉత్తరాల్లో ఎంపిక చేసిన కొన్ని ఉత్తరాలను ప్రధాని మోడీ చదివి వినిపించారు. దేశవ్యాప్తంగా తనకు ఉత్తరాలు అందాయని పేర్కొన్నారు. ఈ ఉత్తరాల్లో అవినీతి రహిత భారత్‌ను కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
దేశంలో అవినీతి నిర్మూలించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విద్య, వైద్యాన్ని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని మోడీ చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా క్రొయేషియా నుంచి కూడా తనకు లేఖలు అందాయని చెప్పారు. ఈ దేశం నుంచి 75 పోస్ట్‌కార్డులు కూడా అందాయని మోదీ చెప్పారు. ఈ పోస్ట్‌కార్డ్‌లను క్రొయేషియాలోని జాగ్రెబ్‌లోని అప్లైడ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ విద్యార్థులు పంపారని తెలిపారు.
మోడీ తన ప్రసంగంలో భారతీయ పౌరులు సాధించిన విషయాలను ప్రస్తవించారు. కొబ్బరి బొండాలు అమ్మడం ద్వారా సంపాదించిన ₹1 లక్షను పాఠశాలకు విరాళంగా అందించిన తాయమ్మాళ్ అనే తమిళనాడు మహిళ గురించి PM మాట్లాడారు.
అలాగే.. ఒక నిమిషంలో 109 పుష్ అప్‌లు చేసి రికార్డు సృష్టించిన తౌనోజం నిరంజోయ్ సింగ్ అనే 24 ఏళ్ల మణిపూర్ యువకుడిని ఈ సందర్భంగా ప్రశంసించాడు. యువత నిరంజోయ్ సింగ్ నుండి స్ఫూర్తి పొందుతారని ప్రధాని తెలిపారు.
అలాగే.. లడఖ్‌లో ఓపెన్ సింథటిక్ ట్రాక్, ఆస్ట్రో టర్ఫ్ ఫుట్‌బాల్ స్టేడియం గురించి మాట్లాడాడు, ఇది FIFA నుండి సర్టిఫికేషన్ కూడా పొందిందని, ఈ స్టేడియం 10,000 అడుగులకు పైగా ఎత్తులో నిర్మిస్తామని, ఒకేసారి 30,000 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా అతిపెద్ద ఓపెన్ స్టేడియం అవుతుందని ప్రధాని చెప్పుకొచ్చారు.
ప్రధాని తన ప్రసంగంలో ఇటీవల మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ వద్ద మరణించిన ప్రసిద్ధ కాలర్‌వాలి పులిని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి, మూగ జీవుల పట్ల భారతీయులకు అమితమైన ప్రేమ ఉందని, ఈ విషయాన్ని ప్రపంచదేశాలు ప్రశంసించాయని గుర్తు చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవంలో చివరి పరేడ్‌లో పాల్గొన్న విరాట్ (గుర్రం) గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. విరాట్.. అపారమైన సేవలను అందించిందని తెలిపారు.
కోవిడ్-19కి వ్యతిరేకంగా టీకాలు వేయడానికి దేశ పౌరులు, ముఖ్యంగా యువత చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇప్పటిదాకా నాలుగున్నర కోట్ల మంది 15-18 సంవత్సరాల్లోపు పిల్లలు కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే- కోటిమందికి పైగా బూస్టర్ డోసులను వేసుకున్నారని చెప్పారు. జనాభాలో 75 శాతం మంది పెద్దలు కరోనా వైరస్ టీకాలను వేసుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఈ స్థాయిలో వ్యాక్సినేషన్‌ను కొనసాగించామని వ్యాఖ్యానించారు. దీన్ని విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
పద్మశ్రీ అవార్డులను పొందిన సామాన్యుల పేర్లను ప్రస్తావించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకుంటున్నామని చెప్పారు. వారంతా అన్ సంగ్ హీరోలని మోడీ అన్నారు. వారందరికీ నివాళి అర్పించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని మోడీ గుర్తు చేశారు.ప్రధాని తన ప్రసంగం ముగింపులో.. పశ్చిమ బెంగాల్ లో మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ని స్థాపించారని ప్రధాని మోదీ అన్నారు. అలాగే, మహారాజు గాయక్వాడ్ విద్యను ప్రోత్సహించారని ఆయన చెప్పారు.