తమిళ టైగర్ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా సజీవంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఎండీఎంకే నేత వైకో వెల్లడించారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను ఈ రోజు కేక్ కట్ చేసి జరుపుకున్నట్టు తెలిపారు.
చెన్నై: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా సజీవంగానే ఉన్నారని మారుమలార్చి ద్రవిడ మున్నేట్రా కజగం జనరల్ సెక్రెటరీ వైకో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేక్ కట్ చేసి ఈ రోజు ప్రభాకరన్ పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకున్నామని ఆదివారం వెల్లడించారు.
‘ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బ్రతికే ఉన్నాడని మేం నమ్ముతున్నాం. ఈ రోజు కేక్ కట్ చేసి ఆయన బర్త్ డే వేడుకలు చేసుకున్నాం. ఆయన వెన్నంటే ఉండిన పజ నెదుమారన్, కాసి ఆనందన్‌లు అబద్ధాలు ఆడుతారని నేను అనుకోను’ అని వైకో చెప్పారు.
ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళ్ నేషనలిస్ట్, ప్రముఖ రాజకీయ నాయకుడు పజా నెదుమారన్ వెల్లడించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తాడని చెప్పారు. ‘ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తమిళ ప్రజలకు చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆయన మరణం చుట్టూ ఉన్న అనేక వదంతులకు ఇంతటితో తెరపడుతుందని ఆశిస్తున్నాను. తమిళ్ ఈలంకు విముక్తి ఇవ్వడానికి ఆయన తన ప్రణాళికలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతారు’ అని నెదుమారన్ వివరించారు. కాసి ఆనందన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రభాకరన్‌ను చంపారని చెబుతున్న శ్రీలంక ప్రభుత్వం అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.
Also Read: Miracle: పసిఫిక్ పై నుంచి వెళ్లుతుండగా విమానం పైకొప్పు ఊడిపోయింది.. అనూహ్యంగా..! మిరాకిల్ స్టోరీ ఇదే
శ్రీలంకలో ప్రత్యేక దేశాన్ని తమిళ్ ఈలం పేరిట ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వంపై తమిళ టైగర్లు 26 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేశారు. ఎల్‌టీటీఈని స్థాపించిన ప్రభాకరనే చివరి వరకు దానికి నాయకత్వం వహించారు. శ్రీలంకలో తమిళులపై తీరని వివక్ష అమలవుతున్నదని, వారికి విముక్తి కల్పించడమే ఎల్‌టీటీఈ లక్ష్యమని వారు చెప్పేవారు. ఇండియా, యూఎస్, కెనడా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు ఎల్‌టీటీఈని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.
2009 మే 18వ తేదీన శ్రీలంక ప్రభుత్వం ప్రభాకరన్‌ను చంపినట్టు వెల్లడించింది. ప్రభాకరన్ పారిపోతుండగా కాల్పుల్లో మరణించాడని శ్రీలంక ఆర్మీ చెబుతున్నది. ఆయన బాడీకి తర్వాత డీఎన్ఏ టెస్టు కూడా చేసినట్టు పేర్కొంది.