ఉత్తర చైనాలో పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు వస్తుండటంతో మరోసారి ప్రపంచం భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. శ్వాస కోశ సమస్యలు మనదేశంలో ఎదురైతే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఆదివారం కేంద్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఉత్తర చైనాలో పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు వస్తుండటంతో మరోసారి ప్రపంచం భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. కరోనాకు పుట్టినిల్లు కావడంతో.. అక్కడ కొత్తగా ఏ వైరస్ వెలుగుచూసినా జనం ఉలిక్కిపడుతున్నారు. తాజా పరిస్దితుల నేపథ్యంలో చైనాకు పొరుగున వున్న భారతదేశం సైతం అప్రమత్తమైంది. చైనాలో పిల్లల్లో వెలుగుచూస్తోన్న శ్వాస కోశ సమస్యలు మనదేశంలో ఎదురైతే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఆదివారం కేంద్ర ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తక్షణం ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో సంసిద్ధతపై పరిస్ధితులు అంచనా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. ఆసుపత్రులలో మానవ వనరులు , హాస్పిటల్ బెడ్‌లు, అవసరమైన మందులు, మెడికల్ ఆక్సిజన్, యాంటీ బయాటిక్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) , టెస్టింగ్ కిట్‌లు, రియాజెంట్‌లు తగినన్ని అందుబాటులో వుండేలా చూడాలని కేంద్రం సూచించింది. దీనికి అదనంగా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు , ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్‌ల సరైన పనితీరును నిర్ధారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ఇన్‌ఫెక్షన్ నియంత్రణ ప్రోటోకాల్‌ను నిశితంగా సమీక్షించాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి తన ఆదేశాలలో తెలిపారు.
కోవిడ్ 19 సమయంలో సవరించిన నిఘా వ్యూహం ప్రకారం మార్గదర్శకాలు అమలు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఇన్‌ఫ్లూయెంజా లాంటి అనారోగ్యం (ఐఎల్ఐ), తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం (ఎస్ఏఆర్ఐ) సహా శ్వాసకోశ వ్యాధికారక సమగ్ర నిఘా కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసేలా ఈ ఏడాది ప్రారంభంలో మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) జిల్లా, రాష్ట్ర నిఘా విభాగాల ద్వారా ఐఎల్ఐ-ఎస్ఏఆర్ఐ ధోరణులను పర్యవేక్షించాలని చెప్పింది. ఐఎల్ఐ-ఎస్ఏఆర్ఐ డేటాను ఐడీఎస్‌పీ పోర్టల్‌కు సకాలంలో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఇవి మెడికల్ కాలేజీ ఆసుపత్రులతో సహా ప్రజారోగ్య సంస్థల సమర్ధవంతమైన పర్యవేక్షణ, వ్యాప్తి ప్రతిస్పందన కోసం చాలా అవసరమని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది.
ముగిసిపోయిందనుకున్న కోవిడ్ 19 భయాలు ఇప్పటికీ చైనాను వెంటాడుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా ఇప్పటికీ వ్యాప్తి చెందుతూ అధికార యంత్రాగానికి సవాల్ విసురుతోంది. తాజా న్యూమోనియా కూడా కోవిడ్ మాదిరిగా వేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా విద్యాసంస్ధలు దీనికి కేంద్రాలుగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభ రోజుల్లో చూసిన భయంకరమైన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ.. న్యూమోనియా లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. వీరిలో చిన్నపిల్లలే బాధితులుగా వుండటం ఆందోళన కలిగిస్తోంది.
శ్వాసకోశ వ్యాధుల తీవ్రత నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో చైనా జాతీయ ఆరోగ్య కమీషన్‌కు చెందిన అధికారులు సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్త వైరస్ గురించి ఆందోళనలను తొలగిస్తూ.. గుర్తించిన వ్యాధికారక క్రిముల కలయిక వల్లే ఈ వ్యాధి సంభవించిందని చైనా హెల్త్ కమీషన్ స్పష్టం చేసింది.