తక్కువ లోతులో నీరు, నది అడుగులో రాళ్లే ప్రాణ నష్టానికి కారణం.. గుజరాత్ బ్రిడ్జి విషాదంపై ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్

By team teluguFirst Published Nov 2, 2022, 2:29 AM IST
Highlights

మచ్చూ నదిలో నీరు ప్రవహించకపోవడం, అడుగు భాగంలో ఉన్న రాళ్ల వల్లే పెద్ద మొత్తంలో సందర్శకులు మోర్బీ కేబుల్ ప్రమాదంలో చనిపోయారని సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్న కుమార్ తెలిపారు. మరో ఒకటి, రెండు మృతదేహాలను వెలికి తీయాల్సి ఉందని చెప్పారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదానికి కారణం ఏంటనే విషయంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్న కుమార్ ఓ అంచనాను వ్యక్తం చేశారు. తక్కువ లోతులో నీరు, ఆ నీటిలోని రాళ్లే వల్ల ఇంత పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగిందని ఆయన ‘ఎన్టీటీవీ’కి తెలిపారు. 

‘‘ శతాబ్ద కాలం నాటి కేబుల్ బ్రిడ్జికి రెండు చివర్లలో నీరు నిస్సారంగా ఉంది. నది అడుగు భాగంలో రాళ్లు ఉన్నాయి. కేబుల్ బ్రిడ్జి తెగిపోయినప్పుడు సందర్శకులు వేగంగా, బలంతో కిందపడిపోయారు. దీంతో నది అడుగు భాగంలో ఉన్న రాళ్లు ఢీకొట్టడంతో చాలా మంది తీవ్రగాయాలై చనిపోయారు. ’’ అని ఆయన చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ లో జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం..

నది మధ్య ప్రాంతంలో సుమారు 20 అడుగుల లోతులో  ప్రవాహం లేకుండా నిలిచిపోయిన నీరు ఉందని ఆయన అన్నారు. మృతదేహాల కోసం వెతుకుతున్న నావికా దళ డైవర్లు అప్రయత్నంగా కిందికి దిగినప్పుడు ఈ విషయం తెలిసిందని ప్రసన్న కుమార్ అన్నారు. అయితే నీరు బురదగా ఉండటంతో అందులో ఏమీ కనిపించడం లేదని తెలిపారు. మృతదేహాలను గుర్తించడానికి కెమెరా, సోనార్ పరికరంతో అమర్చిన అల్ట్రా మోడర్న్ రిమోట్ అండర్వాటర్ వాహనాన్ని ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు.

నదికి ఎలాంటి ప్రవాహం లేకపోవడం వల్ల మృతదేహాలు ఎక్కడికి కదలలేదని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండెంట్ తెలిపారు. అందుకే విరిగిన వంతెన అనేక మృతదేహాలు లభ్యం అయ్యాయని చెప్పారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన తప్పిపోయిన వ్యక్తుల వివరాల ఆధారంగా ఇంకా ఒకటి లేదా రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమవుతాయని ఆయన అన్నారు.

UCC: యూసీసీని అమలు చేసే ఉద్దేశం బీజేపీకి లేదు: అరవింద్ కేజ్రీవాల్

కాగా.. ప్రజల రద్దీ కారణంగా ఇరుకైన కేబుల్ వంతెన కూలిపోయిందని గుజరాత్ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చిలో ఈ వంతెన పునరుద్దరణ పనులు మొదలయ్యాయని పేర్కొన్నాయి. అయితే ఆ సమయంలో వంతెనకు ఇది వరకు ఉన్న కేబుల్స్ స్థానంలో కొత్తవి అమర్చలేదని, పాత వాటిని అలాగే ఉంచారని వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మంత్రులు హర్ష్ సంఘ్వీ, బ్రిజేష్ మెర్జా, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, స్థానిక కలెక్టర్, ఎస్పీ, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రమాద స్థలాన్ని ప్రధాని పరిశీలించారు

ఆదివాసీల ఓట్ల కోసం బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీకి కేంద్రంగా 'ఆదివాసీ జలియన్‌వాలా'

కేబుల్ బ్రిడ్జి ప్రమాదం చోటుచేసున్న అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్, బాధితులకు అందించిన సహాయాన్ని అధికారులు ప్రధానికి ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలను గుర్తించే వివరణాత్మకమైన, విస్తృతమైన విచారణను నిర్వహించడం ప్రస్తుతం ఆవశ్యకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విచారణలో వెలుగుచూసే విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులను ప్రధాని పరామర్శించారు.

click me!