మోర్బీ బ్రిడ్జీ ఘటనతో అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్.. 2,109 వంతెనల ఫిట్ నెస్ ను పరీక్షించాలని మమతా సర్కార్ ప్లాన్

By team teluguFirst Published Nov 2, 2022, 12:25 AM IST
Highlights

2,109 బ్రిడ్జిల ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవాలని పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. గుజరాత్ లో చోటు చేసుకున్న మోర్బీ లాంటి ఘటన జరగకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. 
 

గుజరాత్‌లో  మోర్బీలో దాదాపు 100 ఏళ్ల బ్రిడ్జి కూలి 141 మంది చనిపోయారు. ఈ ఘటనతో దేశం అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటనే విషయంలో పోలీసులు, అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్ లో జాయింట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం..

కేబుల్ బ్రిడ్జీ కూలిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఇలాంటి విషాదం మరెక్కడా జరగకూడదని పలు రాష్ట్రాలు చర్యలు మొదలు పెట్టాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుగానే అలెర్ట్ అయ్యింది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 2,109 వంతెనలకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీనియర్ అధికారి వెల్లడించినట్టు ‘ఎన్డీటీవీ’ ఓ కథనంలో వెల్లడించింది. 

రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి పులక్ రాయ్ సీనియర్ అధికారులు, ఇంజనీర్‌లతో ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలో ఉన్న వంతెనల పరిస్థితిని పరిశీలించాలని, నవంబర్ చివరిలోగా దీనికి సంబంధించిన నివేదికలను అందజేయాలని వారికి సూచించారు. ఈ  సర్వేలో ఏవైనా వంతెనల్లో సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లను రాయ్ ఆదేశించారు. 

Bharat Jodo Yatra: చార్మినార్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ

సిలిగురిలోని పట్టాభిషేక వంతెన, కంగ్‌సబతి మీదుగా ఉన్న బీరేంద్ర సస్మాల్ సేతుకు వీలైనంత త్వరగా మరమ్మతులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సంత్రాగచ్చి వంతెన మరమ్మతులకు అవసరమైన పనులు కూడా నవంబర్ 10 నుంచి ప్రారంభమవుతాయని సీనియర్ అధికారి పేర్కొన్నారు. అలాగే కాంగ్‌సబతి, శిలాబతి నదులపై రెండు కొత్త వంతెనలు నిర్మిస్తామని తెలిపారు. ఈ విషయంలో మంత్రి పులక్ రాయ్ ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. గుజరాత్ లో జరిగిన ఘటన చూసిన తరువాత తమ రాష్ట్రంలో అన్ని వంతెనలకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. తమ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని భావిస్తున్నామని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మంత్రులు హర్ష్ సంఘ్వీ, బ్రిజేష్ మెర్జా, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, స్థానిక కలెక్టర్, ఎస్పీ, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రమాద స్థలాన్ని ప్రధాని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని రకాల సాయం అందేలా చూడాలని ఆయన అధికారలను ఆదేశించారు. 

బసవలింగ స్వామి మృతి కేసు.. పోలీసు కస్టడీకి హనీట్రాప్ ముఠా, మరింత మంది స్వాములకు యువతి వల?

ఈ సమావేశం సందర్భంగా.. కేబుల్ బ్రిడ్జి ప్రమాదం చోటుచేసున్న అనంతరం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్, బాధితులకు అందించిన సహాయాన్ని అధికారులు ప్రధానికి వివరించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలను గుర్తించే వివరణాత్మకమైన, విస్తృతమైన విచారణను నిర్వహించడం ప్రస్తుతం ఆవశ్యకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విచారణలో వెలుగుచూసే విషయాలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటనలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులను ప్రధాని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య  పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

click me!