
బెంగళూరు : ఇటీవల కాలంలో ప్రియురాళ్లపై దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తమతో రిలేషన్ పెట్టుకుని బ్రేకప్ చెప్పడం.. తమ ప్రేమను కాదనుకోవడంతో ప్రేమోన్మాదంతో ప్రియుళ్లు రెచ్చిపోతున్నారు. పాశవికంగా దాడికి దిగి హత్యల వరకు వెళ్తున్నారు. అలాంటి ఓ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ప్రియురాలిపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేసి 16 సార్లు కర్కశంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ దారుణ ఘటన మంగళవారం రాత్రి బెంగళూరులో చోటుచేసుకుంది. ఆమెను పొడిచిన తర్వాత సదరు నిందితుడు ఆమె వద్దే కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు.
ఆమె ఆఫీస్ నుంచి బయటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఆఫీస్ లో నుంచి బయటికి రాగానే ఆమెకు ప్రియుడు ఎదురయ్యాడు.. నీతో మాట్లాడాలని పక్కకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత ఒక్కసారిగా కత్తితో ఆమె మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమెకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. తామద్దరూ ప్రేమించుకున్న.. పెళ్లి చేసుకోవడానికి ఆమె ఇష్టపడకపోవడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా 16 సార్లు పొడిచాడు. బెంగళూరులోని జీవన బీమా నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిందితుడు, బాధితురాలు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే. బాధితురాలను లీలా పవిత్ర నలమాటి (28)గా గుర్తించారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రెల్లి వలస గ్రామానికి చెందిన దినకర్ బాణాల (29) అని పోలీసులు తెలిపారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: ఆధిక్యంలో బీజేపీ
పక్క పక్కన ఉన్న ఆఫీసుల్లో పనిచేయడం ద్వారా వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా ఇద్దరు ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి వైపు పెద్దల నుంచి.. కులాలు వేరు కావడంతో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆమె ప్రియుడికి దూరంగా ఉండడం మొదలుపెట్టింది. ఇదే విషయం మీద రెండు నెలల కిందట కూడా వీరిద్దరూ ఓసారి గొడవపడ్డారు. అప్పటి నుంచి లీల.. దినకర్ తో మాట్లాడడం లేదు. అతను ఎన్నిసార్లు ఆమెతో మాట్లాడని ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన దినకర్ ఈ దారుణానికి ఒడికట్టినట్లు పోలీసులు తెలిపారు.
హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమై రక్తపు మడుగులో పడిపోయిన లీలను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత ఆమె మరణించినట్లుగా ప్రకటించారు. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు దినకర్ ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిమీద లీలా తల్లి మాట్లాడుతూ.. తన కూతురు ఆదివారం ఫోన్ చేసి దినకర్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తూ, భయపెడుతున్నాడని చెప్పిందన్నారు. యాసిడ్ పోస్తానని, నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి వాపోయిందన్నారు. దీంతో తాను ఇంటికి తిరిగి వచ్చేస్తానని చెప్పిందని అంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరవుతున్నారు.
దీనిమీద దినకర్ తండ్రి మాట్లాడుతూ ఇలాంటి దారుణం ఎవరు చేసినా తప్పేనని తన కొడుకు ది ముమ్మాటికీ నేరమేనన్నారు. అతను చిన్నప్పటినుంచి క్షణికావేశానికి లోనయ్యే మనస్తత్వమని చెప్పాడు. ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదని.. అతని ప్రేమ విషయం తమకు తెలియదని అన్నారు.