ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అసలు బిల్లులో ఏముందంటే..

By Sumanth KanukulaFirst Published Dec 20, 2021, 3:46 PM IST
Highlights

ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానించేందుకు వీలు కల్పించే ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021కు (The Election Laws (Amendment) Bill, 2021) లోక్‌సభ (Lok Sabha) సోమవారం ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. 

ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానించేందుకు వీలు కల్పించే ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021కు (The Election Laws (Amendment) Bill, 2021) లోక్‌సభ (Lok Sabha) సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అడ్డుకోవడానికి విపక్షాలు చివరి వరకు యత్నించాయి. వారి నిరసనల మధ్యే ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. బోగస్ ఓట్లను తొలగించడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్టుగా కేంద్రం తెలిపింది. అనంతరం Lok Sabha రేపటికి (డిసెంబర్ 21)కి వాయిదా పడింది. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీని ద్వారా గోప్యతకు భంగం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా కేంద్రం   Election Laws Amendment Billను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును నేడు కేంద్ర మంత్రి  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు నేడు సభలో ప్రవేశపెట్టారు. 

అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు.  అయినప్పటికీ దీన్ని ప్రవేశ పెట్టడానికి స్పీకర్ అంగీకరించడంతో కేంద్రమంత్రి న్యాయశాఖ మంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. 

సవరణ బిల్లు ఏమిటి..?
ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం,  ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం,   ఈసీకి మరిన్ని అధికారాలు  కల్పించడంతోపాటు బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లుగానే, ఓటర్ ఐడి కార్డు లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నెంబర్ను అనుసంధానం చేయనున్నారు. ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటే తొలగించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. అయితే ఆధార్ నెంబర్ ఇవ్వలేకపోయినంత మాత్రాన ఏ ఒక్కరికీ ఓటు హక్కు నిరాకరించకూడదని తాజా బిల్లులోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 

కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించికునేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే,  కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే, పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు. 

click me!