రాహుల్ గాంధీకి మరో షాక్.. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని నోటీసు, ఏప్రిల్ 22 వరకు డెడ్‌లైన్

By Siva KodatiFirst Published Mar 27, 2023, 6:12 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వ గృహంలో వుండటానికి వీల్లేదని ప్యానెల్ నోటీసుల్లో స్పష్టం చేసింది. అందువల్ల బంగ్లాను ఖాళీ చేయాలని గడువు విధించింది. 

అనర్హత వేటుతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయనకు సోమవారం లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22 లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వ గృహంలో వుండటానికి వీల్లేదని ప్యానెల్ నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే దీనితో పాటు నెలవారీ అందుతోన్న రూ.50 వేల వేతనం , రూ.45 వేల ఇతర అలవెన్సులు, రూ. 2 వేల రోజువారీ అలవెన్సులు, 3 ఫోన్లు, మెడికల్ అలవెన్సులు, ఉచిత మంచినీరు, విద్యుత్ కనెక్షన్లకు సైతం కోత పడనుందా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు నివాసానికి రాహుల్ గాంధీ మారే అవకాశం వుంది. 

కాగా..సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు నుంచి ఆయనను డిస్‌క్వాలిఫై చేశారు. 2019 క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, అనర్హత వేటు మాత్రం తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొనడం గమనార్హం. 

ALso REad: రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?

దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు వివరణ ఉన్నది. కేరళలోని పార్లమెంటు వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిందని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇదిలావుండగా.. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టును ఆశ్రయించారు. ఆర్థిక నేరస్తులను పేర్కొంటూ వీరిందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంటున్నది? అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. దీంతో మోడీ ఇంటి పేరున్న పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. 30 రోజుల పాటు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ రాహుల్ గాంధీకి అవకాశం కల్పించింది.

 

click me!