Yuvraj Singh: పొలిటికల్ ఎంట్రీపై యువీ క్లారిటీ..! ఇంతకీ ఏమన్నారంటే..? 

By Rajesh Karampoori  |  First Published Mar 2, 2024, 5:16 AM IST

Lok Sabha Elections 2024: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారనీ,  2024 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై తొలి సారి యువరాజ్ సింగ్ స్పందించారు.  


Lok Sabha Elections 2024: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, సిక్సర్ కింగ్‌గా పేరుగాంచిన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారనీ,  2024 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్  తొలిసారి స్పందించారు.  

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. తాను గురుదాస్‌పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఆవాస్తవం, అవి కేవలం పుకార్లేనని పేర్కొన్నారు. ప్రజలకు  సహాయం చేయడం తనకు ఇష్టమని, తన ఫౌండేషన్ @YOUWECAN ద్వారా ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. తన సామర్థ్యానికి తగ్గట్టుగా ప్రజలకు సేవ చేస్తానన్నారు. 

Latest Videos

ప్రస్తుతం సన్నీ డియోల్ గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డియోల్ స్థానంలో యువరాజ్ సింగ్ బరిలోకి దిగుతారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువరాజ్ సింగ్ సమావేశం తర్వాత ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే.. ఇప్పుడు మాజీ క్రికెటర్ స్వయంగా ముందుకు వచ్చి.. అవన్నీ కేవలం పుకార్లు అని పేర్కొన్నాడు.

వాస్తవానికి గురుదాస్‌పూర్‌ స్థానం నుంచి బీజేపీ సెలబ్రిటీ అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తోంది. దివంగత నటుడు వినోద్ ఖన్నా 1998, 1999, 2004,2014లో గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.  సన్నీ డియోల్ రెండుసార్లు విజయం సాధించారు. కానీ, ఇటీవల ఆయన ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు సరిపోననీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని తెలిపారు. తాను నటుడిగా మాత్రమే కొనసాగాలని భావిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో ఈసారి గురుదాస్‌పూర్ నుంచి భాజపా అభ్యర్థిని మార్చాలని నిర్ణయించింది.

యువరాజ్‌తో పాటు, నటుడు అక్షయ్ కుమార్, నటి కంగనా రనౌత్, భోజ్‌పురి గాయకుడు-నటుడు పవన్ సింగ్ గురించి కూడా వారు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీ చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి. అక్షయ్‌ను చాందినీ చౌక్‌ నుంచి, కంగనాను హిమాచల్‌ లేదా మథుర నుంచి, పవన్‌ సింగ్‌ పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే.. ఇవి ఊహాగానాలు మాత్రమే, అధికారిక నిర్ధారణ ఇంకా రావాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తన తొలి జాబితాను ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. అందులో పైన పేర్కొన్న స్థానాలకు సంబంధించిన పరిస్థితి స్పష్టమయ్యే అవకాశం ఉంది.

click me!