
Election Commission: దేశంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు శుక్రవారం ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
కులం, మతం, భాష, ఇతర అనేక మార్గాల్లో ఓట్లను అడగొద్దని, భక్తులు, దైవ సంబంధ విషయాలను అవమానించవద్దని సూచించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ తెలిపింది. ప్రధానంగా ఇదివరకు నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా ఉండాలని హెచ్చరించింది.
ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే
>> కుల, మతతత్వ ప్రాతిపదికన ఓటర్ల మధ్య విభేదాలు పెంచి పరస్పర విద్వేషాలు సృష్టించే చర్చలు ఉండకూడదు.
>> కులం, వర్గం, భాష, మతం ప్రాతిపదికన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయరాదు. దేవుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు.
>> ఓటర్లను తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదు. తప్పుడు ప్రకటనలు మానుకోవాలి.
>> ప్రజా కార్యకలాపాలకు సంబంధం లేని ఏ పార్టీ నాయకుడి లేదా కార్యకర్త వ్యక్తిగత జీవితంలోని ఏ అంశాన్ని విమర్శించకూడదు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులు లేదా అవమానాలకు దూరంగా ఉండాలి.
>> దేవాలయాలు, మసీదులు , గురుద్వారాలు లేదా ఏ ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించకూడదు.
>> ప్రచార సమయంలో మహిళల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడకూడదు.
>> తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయరాదు. వంటి తదితర హెచ్చరికలు సూచించింది.