coronavirus: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో coronavirus ఉధృతి అధికంగా ఉంది. కేసులు గరిష్టంగా నమోదవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి లాక్‌డౌన్ లోకి వెళ్లనుంది !
coronavirus: కోవిడ్-19 కలవరానికి గురిచేస్తున్నది. coronavirus కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కారణంగా కోవిడ్-19 కేసులు చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్ లోనూ సాధారణ కరోనా రోజువారీ కేసులు లక్షకు పైగా వెలుగుచూశాయి. మహారాష్ట్రలో దీని ప్రభావం అధికంగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అయితే, కరోనా విజృంభణ మామాలుగా లేదు. రోజువారీ కేసులు 20లను దాటాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ముంబయిలో మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లనుందా? అంటే అవుననే సమాధానం వినిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న coronavirus కొత్త కేసులు 60 శాతానికి పైగా ఒక్క ముంబయిలోనే వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముంబయిలో పూర్తి లాక్ డౌన్ విధించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే విషయంపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే.. ప్రస్తుతం పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత COVID పరిస్థితులు దారుణంగా మారుతున్న నేపథ్యంలో ముంబయిలో లాక్‌డౌన్ విధించే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారని" తెలిపారు.
ఇటీవలే ముంబయిలో లాక్‌డౌన్ విధించడం గురించి మేయర్ కిషోరీ పండేకర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముంబయిలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 20వేల మార్కు దాటితే నగరంలో లాక్ డౌన్ విధిస్తామని ఆమె స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముంబయిలో స్కూళ్లు అన్నీ ఇప్పటికే మూసివేసి ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రజారోగ్యం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లాక్ డౌన్ ను ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు. అలాంటి పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే ప్రజలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని తెలిపారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు సైతం ముంబయి COVID పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం మెరుగైన చర్యలు తీసుకుంటున్నమని తెలిపారు.
"67,31,871 పాజిటివ్ కోవిడ్ కేసులతో మహారాష్ట్ర అత్యంత దెబ్బతిన్న రాష్ట్రంగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదనీ, మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబయిలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముంబయిలో లాక్‌డౌన్ విధించే అంశంపై గురించి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారు" అని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే అన్నారు. అలాగే, ముంబయాలో ఒక్కరోజే 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదైన నేపథ్యంలో BMC చీఫ్ IS చాహల్ మాట్లాడుతూ..రోజువారీ కేసులు 20,000 మార్కును దాటితే పౌర సంఘం అదనపు ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నదని చెప్పారు. ముంబయి లాక్‌డౌన్ అంశంపై గురువారం జరిగిన సమావేశంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే, ఇతర అధికారులు చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై తుది నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీసుకుంటారని పేర్కొన్నాయి. ఇదిలావుండగా, రాష్ట్ర రాజధాని నగరం ముంబయిలో కొత్తగా 20,181 మంది కరోనా బారినపడ్డారు. ఈ ఏడాది ముంబయిలో నమోదైన అత్యధిక ఒకరోజు కేసులు ఇవే. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 67,93,297 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 1,41,594 వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ కేసులు సైతం 876కు పెరిగాయి.