coronavirus: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. COVID-19 కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 338 మంది వైద్యులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది.
coronavirus: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరానికి గురిచేస్తున్నది. coronavirus కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కారణంగా కోవిడ్-19 కేసులు చాలా దేశాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్ లోనూ సాధారణ కరోనా రోజువారీ కేసులు లక్షకు పైగా వెలుగుచూశాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో అయితే, దీని ప్రభావం మరింత అధికంగా ఉంది. రోజువారీ కొత్త కేసులు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్రలో గత నాలుగు రోజుల్లో 338 మంది రెసిడెంట్ వైద్యులు కరోనా బారినపడ్డారని మహారాష్ట్ర స్టేట్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (MARD) అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ దహిఫాలే వెల్లడించారు.
“గత నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుండి 338 రెసిడెంట్ వైద్యులు COVID-19 బారినపడ్డారు” అని Maharashtra State Association of Resident Doctors (MARD) అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ దహిఫాలే తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలో అత్యంత ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఆ సమయంలో కరోనా కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. ప్రస్తుతం మళ్లీ కరోనా థర్ఢ్ వేవ్ ప్రారంభమైందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 36,265 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. 36 శాతం కొత్త కేసులు పెరిగాయి. ఇదే సమయంలో వైరస్ కారణంగా 13 మంది చనిపోయారు. అయితే, coronavirus కేసుల్లో అత్యధికం దేశ ఆర్థిక రాజధాని ఒక్క ముంబయిలోనే నమోదుకావడం స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని నగరం ముంబయిలో కొత్తగా 20,181 మంది కరోనా బారినపడ్డారు. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక ఒకరోజు కేసులు ఇవే. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 67,93,297 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 1,41,594 వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ కేసులు సైతం 876కు పెరిగాయి.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుదలపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ ఆందోళనకరంగా ఉందని తెలిపారు. వైరస్ కట్టడికి కోసం అన్ని రకాల మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముంబయి నగరంలో coronavirus వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముంబయి లోకల్ రైలు ప్రయాణాలు, అంతర్ జిల్లా ప్రయాణాలపై ఆంక్షలు విధించే విషయాన్ని మున్ముందు ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. అయితే, ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెద్దగా పెరగలేదని తెలిపారు. కాబట్టి ఇప్పటికీ ప్రయాణాల నిషేధం విషయం గురించి ఆలోచించడం లేదని తెలిపారు. coronavirus పంజా నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తారనే మీడియా కథనాలను సైతం ఆయన తోసిపుచ్చారు.