
రాష్ట్రంలో పెరుగుతున్న విద్వేషాలు, మత రాజకీయాలను అరికట్టాలని కర్ణాటకకు చెందిన అరవై మంది మేధావులు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి లేఖ రాశారు. హిజాబ్ వివాదం, స్థానిక హిందూ దేవాలయాల వార్షిక ఉత్సవాల జాతర సందర్భంగా ముస్లిం దుకాణదారులను నిషేదించాలని ఇటీవల వెలువడిన నిర్ణయాల నేపథ్యంలో ఈ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ఘటనలు రాష్ట్రంలో అధ్వాన్నమైన పరిస్థితికి దిగజారుస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో కర్ణాటక హైకోర్టు హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారం కాదని తీర్పునిచ్చింది. స్కూల్ లో ప్రతీ ఒక్కరు యూనిఫామ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. అయితే హైకోర్టు తీర్పును అందరూ పాటించాలని ప్రభుత్వం చెప్పింది. హైకోర్టు తీర్పును పాటించని వారిని పరీక్షలు రాయడానికి అనుమతించబోమని తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం 10వ తరగతి బోర్డు పరీక్షకు హిజాబ్ ధరించి హాజరైన కొందరు ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని ప్రభుత్వం నిరాకరించింది.
హిందూ పండుగలు, ఆలయ జాతరల సమయంలో దేవాలయాల పరిసరాల్లో వ్యాపారాలు నిర్వహించకుండా ముస్లిం వ్యాపారులు, ఇతర వస్తువుల విక్రేతలను నిషేధించాలనే డిమాండ్లు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వినిపించాయి. విద్యాసంస్థల్లో హిజాబ్‌లపై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ చాలా మంది ముస్లిం వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. అనంతరం కొన్ని తిరిగి ప్రారంభిస్తామంటే చాలా సంస్థలు దీనిని వ్యతిరేకించాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల చుట్టూ హిందువేతరులు వ్యాపారం నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం ముస్లింలకు హిందూ దేవాలయాల చుట్టూ వ్యాపారం చేసుకోకూడదని పోస్టర్లు వెలిశాయి. ఉడిపిలోని కాపు పట్టణంలోని మారి గుడి దేవాలయ యాజమాన్యం వార్షిక ఆలయ పండుగ సందర్భంగా కొన్ని సంస్థల అభ్యర్థన మేరకు.. గుడి ప్రాంగణంలో ఇతర మతానికి చెందిన వ్యక్తులకు వ్యాపారం నిర్వహించడానికి అనమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలిపింది. ఇదే సమయంలో మంగళూరు సమీపంలోని ‘బప్పనాడు దుర్గాపరమేశ్వరి ఆలయం’ వార్షిక జాతరలో ముస్లింలపై ఆంక్షలు ప్రకటిస్తూ వ్యాపారుల స్టాల్స్ పై బ్యానర్లు వేశారు. అయితే ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం ఈ నిషేదాన్ని ప్రోత్సహించదని తెలిపింది. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.
కాగా ముస్లిం వ్యాపారులను బహిష్కరించిన హిందువులకు కొన్ని హిందూ సంస్థలు మద్దతు ఇచ్చాయి. ‘‘కర్ణాటకలో ప్రారంభమైనటువంటి ముస్లిం వ్యాపారస్తుల బహిష్కరణకు శ్రీరామ్ సేన తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది ’’ అని ఆ గ్రూప్ కన్వీనర్ ప్రమోద్ ముతాలిక్ గత వారం చెప్పారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో 60 మంది మేథావులు కర్ణాటక సీఎంకు లేఖ రాశారు.